భారీ భద్రత మధ్య అసెంబ్లీకి ఎమ్మెల్యేలు: అమ్మను తలచుకుని ఓటేయాలని పన్నీరు
మరికొద్ది గంటల్లో బలపరీక్ష జరగనున్న నేపథ్యంలో తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. శనివారం ఉదయం కువత్తూర్ సమీపంలోని గోల్డెన్ బే రిసార్ట్ నుంచి అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు (శశికళ వర్గం).
చెన్నై: మరికొద్ది గంటల్లో బలపరీక్ష జరగనున్న నేపథ్యంలో తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. శనివారం ఉదయం కువత్తూర్ సమీపంలోని గోల్డెన్ బే రిసార్ట్ నుంచి అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు (శశికళ వర్గం) భారీ భద్రతతో అసెంబ్లీకి బయల్దేరారు.
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి బలపరీక్ష ఎదుర్కోనుండటంతో.. ఎమ్మెల్యేలను రిసార్ట్ నుంచి నేరుగా అసెంబ్లీకి తీసుకెళ్లారు. ఇందుకోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేల భద్రత కోసం భారీగా పోలీసులను మోహరించారు. ముఖ్యమంత్రి పళని స్వామి కూడా శనివారం ఉదయమే సచివాలయానికి చేరుకున్నారు.
బలపరీక్షలో పళనిస్వామి నెగ్గాలంటే 117 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. పళనిస్వామి శిబిరంలో ప్రస్తుతం 122 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే వీరిలో 20 మంది ఎమ్మెల్యేలు ఎదురు తిరగగా, పళనిస్వామి వారిని బుజ్జగించినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లిన తర్వాత ఎలా వ్యవహరిస్తారన్నది ఉత్కంఠగా మారింది.

అమ్మను తలచుకుని ఓటేయండి: పన్నీరు పిలుపు
మరికొన్ని గంటల్లో విశ్వాస పరీక్ష జరగనున్న నేపథ్యంలో 'అమ్మ'ను గుర్తుకు తెచ్చుకుని ఓటేయాలని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. ప్రజలు జయలలితను చూసే అన్నాడీఎంకేకు అధికారం ఇచ్చారని గుర్తు చేశారు. కుటుంబ పాలనకు జయ పూర్తిగా వ్యతిరేకమని, ఓటేసే ముందు అమ్మను గుర్తుకు తెచ్చుకోవాలని కోరారు. రాష్ట్రాన్ని కుటుంబ పాలన నుంచి రక్షించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేస్తే 'అమ్మ' ప్రభుత్వానికి, నమ్మిన ప్రజలకు ద్రోహం చేసినట్టు అవుతుందన్నారు. ప్రలోభాలకు లొంగకుండా ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా ఓటేస్తారని నమ్ముతున్నట్టు పేర్కొన్నారు. విశ్వాస పరీక్షలో కనుక పళనిస్వామి నెగ్గితే కనుక రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రజాకోర్టులో ఎమ్మెల్యేలను నిలబెట్టేందుకు పన్నీర్ సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఇదివరకే ప్రకటించారు.
కాగా, పన్నీరుకు మద్దతుగా 12మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఆయన వర్గంలో 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షం డీఎంకే (89), కాంగ్రెస్ పార్టీలు (8) బలపరీక్షలో వ్యతిరేకంగా ఓటు వేయనున్నారు.












Click it and Unblock the Notifications