• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Eknath Shinde: మహారాష్ట్రలోనూ బీజేపీ ‘ఆపరేషన్ లోటస్’ను మొదలుపెట్టిందా

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
మహారాష్ట్ర

మహారాష్ట్రలో రాజకీయాలు వేడెక్కాయి. ఏక్‌నాథ్ శిందే తిరుగుబాటుతో శివసేన నేతృత్వంలోని ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వ భవిష్యత్ ప్రశ్నార్ధకమైంది.

కొంతమంది ఎమ్మెల్యేలతోపాటు సూరత్‌లోని లీ మెరీడియన్ హోటల్‌లో ఏక్‌నాథ్ మకాం వేశారని, ఆయన్ను బుజ్జగించేందుకు సీనియర్ శివసేన నాయకులు అక్కడికి బయలుదేరారని వార్తలు వస్తున్నాయి.

ఏక్‌నాథ్ తిరుగుబాటు మహారాష్ట్రలో బీజేపీ ''ఆపరేషన్ లోటస్’’ను మొదలుపెట్టిందనడానికి సూచన అని మీడియాలో చర్చ జరుగుతోంది.

ఇలాంటి ప్రయోగాలను బీజేపీ ఇదివరకు కొన్ని రాష్ట్రాల్లో చేసింది.

కర్నాటక

1) కర్నాటక

2008లో కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీకి మూడు సీట్లు తక్కువయ్యాయి.

అప్పుడు కొంతమంది స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ప్రకటించారు.

అయినప్పటికీ బీజేపీ ప్రభుత్వం చాలా అస్థిరంగా ఉండేది. దీంతో ఇతర పార్టీలకు చెందిన ఒక్కో నాయకుడు రాజీనామా చేస్తూ బీజేపీలో చేరడం మొదలైంది. దీన్నే ''ఆపరేషన్ లోటస్’’గా పిలిచేవారు.

అప్పట్లో కాంగ్రెస్, జనతా దళ్ సెక్యులర్ (జేడీఎస్) నాయకులు ఒకరి తర్వాత ఒకరు రాజీనామా చేయడం మొదలుపెట్టారు. మొత్తంగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వీరు ఉప ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై పోటీ చేశారు. వీరిలో ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలుగా శాసన సభలో అడుగుపెట్టారు.

దీంతో బీజేపీకి ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు అవసరమైన మద్దతు దక్కింది.

''అప్పట్లో ఆపరేషన్ లోటస్ అనేది బీజేపీ కొత్త ప్రయోగంగా చాలా విశ్లేషణలు వచ్చాయి’’అని సీనియర్ కర్నాటక జర్నలిస్టు ఇమ్రాన్ ఖురేషి చెప్పారు.

పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటు పడకుండా తప్పించుకునేందుకు ఈ ఆపరేషన్‌ను బీజేపీ నిర్వహిస్తుందని ఆయన అన్నారు.

ఒక పార్టీ టికెట్‌పై పోటీచేసి గెలిచిన వారు మరో పార్టీలో చేరితే ఈ చట్టం కింద అనర్హత వేటువేసే అవకాశముంది.

మధ్యప్రదేశ్

2) మధ్య ప్రదేశ్

2018లో మధ్య ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 230 మంది సభ్యులున్న ఈ అసెంబ్లీలో బీజేపీ నుంచి 109 మంది గెలిచారు. కాంగ్రెస్ నుంచి 114 మంది గెలిచారు.

దీంతో స్వతంత్ర ఎమ్మెల్యేల సాయంతో కమల్‌నాథ్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది.

అయితే, ఏడాదిన్నర సమయంలోనే కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య సింధియాల మధ్య విభేదాలు మొదలయ్యాయి.

మొత్తంగా మార్చి 2020లో 22 మంది ఎమ్మెల్యేలతో కలిసి జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరారు.

బయటకు వెళ్లిపోయిన ఎమ్మెల్యేలలో కమల్‌నాథ్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన 14 మంది ఉన్నారు.

ఈ పరిణామాల నడుమ శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటైంది.

3) గోవా

కర్నాటక, మధ్య ప్రదేశ్ తరహాలోనే గోవాలోనూ ఎమ్మెల్యేలను బీజేపీ తమ పార్టీలోకి రప్పించుకొంది.

గోవాలో 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో పది మంది బీజేపీలో చేరారు.

ఇక్కడ మూడింట రెండొంతుల మంది బీజేపీలో చేరడంతో పార్టీ ఫిరాయింపుల చట్టం కింద చర్యలు తీసుకోవడానికి అవకాశమూ లేదు.

ఉత్తరాఖండ్

4) ఉత్తరాఖండ్

2016లో ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంలో తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు.

అయితే, ఈ ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. ఆ తర్వాత రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సస్పెండ్ చేసే రాష్ట్రపతి పాలన విధించారు.

తమ ఎమ్మెల్యేల తిరుగుబాటుకు బీజేపీనే కారణమని కాంగ్రెస్ ఆరోపించింది. ఆ తర్వాత తిరుగుబాటు ఎమ్మెల్యేలూ బీజేపీలో చేరారు.

5) అరుణాచల్ ప్రదేశ్

అరుణాచల్ ప్రదేశ్‌లోనూ 2016లో ఇలానే జరిగింది. ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి బీజేపీ కూటమిలో చేరారు.

మొత్తంగా 42 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ మిత్రపక్షమైన ''పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్’’లో చేరారు.

దేవేంద్ర ఫడణవీస్

ఏమిటీ పార్టీ ఫిరాయింపుల చట్టం?

1985లో రాజ్యాంగంలో పదవ షెడ్యూల్‌ను కొత్తగా చేర్చారు. దీని కోసం 52వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు.

ఎమ్మెల్యేలు, ఎంపీలు తరచూ పార్టీలు ఫిరాయించకుండా దీనిలో నిబంధనలు ఉన్నాయి.

పార్టీలు ఫారియిస్తే, పదవులను కూడా రద్దుచేసేలా మార్పులు చేశారు.

ఆ చట్టం ఎప్పుడు వర్తిస్తుంది?

  1. ఎంపీ లేదా ఎమ్మెల్యేలు తమకు తాముగానే పార్టీని రాజీనామా చేస్తే..
  2. ఎన్నికైన ఎంపీ, ఎమ్మెల్యేలు పార్టీకి విరుద్ధంగా నడుచుకుంటే..
  3. విప్ జారీచేసినప్పటికీ పార్టీ అభీష్టానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే..
  4. చట్టసభలో పార్టీ నిబంధనలను ఉల్లంఘిస్తే..

మినహాయింపు

అయితే, ఇక్కడ కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఒక పార్టీలో మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు వేరే పార్టీలో చేరితే, వారిపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద చర్యలు తీసుకోవడానికి వీల్లేదు.

మొదట్లో మూడింట ఒక వంతు మంది వేరే పార్టీలో చేరితే అనర్హత వేటు వేయకూడదనే నిబంధన ఉండేది. అయితే, 2003లో దీన్ని సవరించారు. మూడింట ఒక వంతుకు బదులుగా మూడింట రెండు వంతులుగా మార్చారు. అప్పట్లో పెద్దయెత్తున నాయకులు పార్టీలు ఫిరాంచడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఎప్పుడు ఈ చట్టం వర్తించదు?

  1. మొత్తం రాజకీయ పార్టీలోని సభ్యులంతా వేరే పార్టీలో చేరినప్పుడు..
  2. ఎన్నికైన సభ్యులు ఒక కొత్త పార్టీని ప్రారంభిస్తే..
  3. రెండు పార్టీలు కలిపేయాలని నిర్ణయించినప్పుడు, దానికి ఇష్టంలేని శాసన సభ్యులు విడిగా ఉండిపోవచ్చు..
  4. మూడింట రెండొంతుల మంది శాసన సభ్యులు కలిసి వేరే పార్టీలో చేరితే..

స్పీకర్ నిర్ణయంపై సమీక్ష

ఈ ఫిరాయింపులకు సంబంధించిన వివాదాలపై తుది నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్ లేదా ఛైర్మన్‌కు ఉంటుందని రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ చెబుతోంది.

పదవ షెడ్యూల్‌లోని ఏడో పేరా ప్రకారం.. ఈ వివాదాల్లో కోర్టులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు.

1991లో ఈ పదవ షెడ్యూల్‌కు సుప్రీం కోర్టు మద్దతు పలికింది. అయితే, ఏడో పేరా మాత్రం చెల్లదని తీర్పునిచ్చింది.

దీని ప్రకారం.. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత దీన్ని సుప్రీం కోర్టు సమీక్షించొచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
ఏక్‌నాథ్ షిండే: మహారాష్ట్రలోనూ బీజేపీ 'ఆపరేషన్ లోటస్' ప్రారంభించిందా?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X