మహా హైడ్రామా: ఏక్‌నాథ్ షిండే సంచలనం: అసెంబ్లీ రద్దు..!!
Maharashtra : మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి మూడు రోజులు గడుస్తోన్నప్పటికీ ఇంకా ముఖ్యమంత్రి ఎవరనేది తేలట్లేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్.. హస్తినలో మకాం వేస్తోన్నారు. ఈ మూడు రోజుల్లో పలుమార్లు ఢిల్లీ పెద్దలతో సమావేశం అయ్యారు.
వరుసగా రెండోసారి ఏక్‌నాథ్ షిండేకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలంటూ శివసేన పట్టుబట్టి కూర్చుంది. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యా బలం బీజేపీకి లేకపోవడాన్ని తనకు అనుకూలంగా మలచుకుంది. రెండో దఫా తమ పార్టీ అధినేతనే కొనసాగించాలంటూ డిమాండ్ చేస్తోంది.

ఈ మేరకు షిండే వర్గ శివసేన మహిళా అధికార ప్రతినిధి శీతల్ మ్హాత్రే ఓ ప్రకటన సైతం జారీ చేశారు. మహారాష్ట్ర ఓటర్లు, పార్టీ క్యాడర్ మొత్తం కూడా షిండే నాయకత్వాన్ని కోరుకుంటోందని తేల్చి చెప్పారు. మహాయుటిలో గల ఇతర పార్టీల కంటే కూడా తమకే అత్యధిక ఓట్ల శాతం పోల్ కావడమే దీనికి నిదర్శనమని అంటోన్నారు.
మొత్తం 288 నియోజకవర్గాలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 145. దీన్ని అలవోకగా అందుకుంది మహాయుటి. ఈ కూటమి అభ్యర్థులు 230 నియోజకవర్గాల్లో ఘన విజయం సాధించారు.
బీజేపీ 149 సీట్లల్లో పోటీ చేసి132 చోట్ల విజయం సాధించింది. షిండే వర్గం శివసేన 81 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టగా 57 మంది గెలుపొందారు. అజిత్ వర్గానికి చెందిన ఎన్సీపీ మొత్తం 59 స్థానాల్లో పోటీ చేయగా 41 సీట్లు ఈ పార్టీ ఖాతాలో పడ్డాయి. లోక్‌సభ ఎన్నికలతో పోల్చుకుంటే ఇప్పుడు ఈ మూడు పార్టీల ఓటుబ్యాంకు అమాంతం పెరిగింది.

ఈ కూటమిలో ఏ ఒక్క పార్టీకి కూడా సొంతంగా ప్రభుత్వాన్ని నెలకొల్పడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ దక్కకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మూడు పార్టీలు ఖచ్చితంగా పరస్పరం సహకరించుకోగలిగితేనే వరుసగా రెండోసారి మహాయుటి అధికారంలోకి రాగలుగుతుంది.
ఈ పరిణామాల మధ్య ఏక్‌నాథ్ షిండే సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేశారు. కొద్దిసేపటి కిందటే షిండే, దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్.. ముంబై కొలాబా ప్రాంతంలోని రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో భేటీ అయ్యారు.
అనంతరం ఆయనకు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఈ రాజీనామాను గవర్నర్ తక్షణమే ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఏక్‌నాథ్ షిండేకు సూచించారు. షిండే రాజీనామాతో అసెంబ్లీ రద్దయినట్టయింది.












Click it and Unblock the Notifications