గొంతుకోసి రిటైర్డ్ టీచర్ల జంట దారుణ హత్య
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. దుండగులు ఓ వృద్ధ దంపతులను గొంతుకోసి వారింట్లోనే హత్య చేశారు. గురువారం జరిగిన ఈ ఘటన కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.
మృతులలో మహిళ గొంతు కోయబడి ఉందని, పురుషుని తలపై తీవ్ర గాయాలున్నాయని డిప్యూటీ కమిషనర్(నార్త్) కోల్‌కతా సువంకర్ సిన్హా సర్కార్ తెలిపారు. అనుమానాస్పద హత్యగా కేసు నమోదు చేసుకున్నామని చెప్పారు.
రక్తపు మడుగులో ఉన్న దంపతులను గమనించిన చుట్టుపక్కల వారు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నట్లు చెప్పారు. మృతులు ఇద్దరు కూడా రిటైర్డ్ ఉపాధ్యాయులని తెలిపారు. వారి ఒక కూతురు ఉందని, ఆమె కూడా నగరానికి దూరంగా ఉంటున్నారని చెప్పారు.

న్యూస్ పేపర్ వేసే వ్యక్తి వారి బాధితుల ఇంటికి వచ్చి వారి డోర్ బెల్ కొడితే ఎవరూ స్పందించలేదని, దీంతో తాము ఇంట్లో ఉండే వ్యక్తికి ఫోన్ చేశామని ఇరుగుపొరుగు వారు చెప్పారు. అయితే ఎన్నిసార్లు ఫోన్ చేసినా.. తీయలేదని తెలిపారు. దీంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంటికి వచ్చి, తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. ఇద్దరు రిటైర్డ్ ఉపాధ్యాయుల మృతదేహాలను వారు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications