ఫామ్-7 పై ఈసీ కఠిన ఆంక్షలు! ఇకపై ఒక్కరికి 10 మాత్రమే.. కొత్త రూల్స్ ఇవే
ఓటర్ల జాబితా ప్రక్షాళన పేరుతో ఇష్టారాజ్యంగా నకిలీ ఫిర్యాదులు చేయడం, ఓట్లను తొలగించాలంటూ విచ్చలవిడిగా దరఖాస్తులు సమర్పించే ఉద్దేశపూర్వక చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘ గట్టి బ్రేక్ వేసింది. ఆధారం లేని ఫిర్యాదులతో అసలైన ఓటర్లను ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా, క్షేత్రస్థాయి అధికారులపై పనిభారాన్ని పెంచుతున్న 'బల్క్' దరఖాస్తుల వ్యవహారాన్ని ఈసీ తీవ్రంగా పరిగణించింది. ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపుకు ఉపయోగించే ఫామ్-7 దరఖాస్తుల సమర్పణపై స్పష్టమైన పరిమితులు విధిస్తూ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన ఎన్నికల అధికారులకు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఇకపై ఒక్కరికి 10 మాత్రమే: కొత్త పరిమితులు ఇవే!
ఎన్నికల సంఘం జారీ చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం.. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (క్లెయిమ్‌లు, అభ్యంతరాల వ్యవధి) మొత్తం మీద ఒక వ్యక్తి గరిష్టంగా 10 ఫామ్-7 దరఖాస్తులను మాత్రమే సమర్పించడానికి అర్హుడు. అలాగే నిరంతర నామినేషన్ల ప్రక్రియ సమయంలో నెలకు గరిష్టంగా 5 ఫామ్-7 ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ దరఖాస్తులను మాత్రమే దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఆన్‌లైన్ ద్వారా ఒకేసారి 6 దరఖాస్తుల దాఖలుకు పరిమితి ఉన్నప్పటికీ, ఆఫ్‌లైన్ లేదా భౌతిక దరఖాస్తుల సంఖ్యపై స్పష్టమైన హద్దులు లేకపోవడంతో కొందరు దీనిని దుర్వినియోగం చేశారు. తాజా నిర్ణయంతో ఈ లొసుగులకు చెక్ పడింది.

అసలైన సంతకం తప్పనిసరి
దరఖాస్తుల పరిశీలనలో అనుసరించాల్సిన నిబంధనలను ఈసీఐ మరోసారి స్పష్టం చేసింది. ఫామ్-7లో ఫిర్యాదుదారునికి సంబంధించిన అన్ని వివరాలు పక్కాగా ఉండాలని, నిర్దేశిత స్థలంలో దరఖాస్తుదారుడి అసలైన సంతకం మాత్రమే ఉండాలని పేర్కొంది. ఒరిజినల్ సంతకానికి బదులుగా ముద్రించిన సీల్ లేదా స్టాంప్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకూడదని స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఫిర్యాదు చేసే వ్యక్తి అదే నియోజకవర్గానికి చెందిన నమోదుకృత ఓటరై ఉండాలనే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది.
నోటీసులు, విచారణ తరవాతే నిర్ణయం: నకిలీ ఫిర్యాదు చేస్తే చర్యలు!
ఓటరు పేరు తొలగింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు ఈసీఐ కఠిన నిబంధనలు విధించింది. ఒక ఓటరుపై అభ్యంతరం వచ్చినప్పుడు, ఆ అభ్యంతరంలో నిజ నిజాలు తెలుసుకునేందుకు దరఖాస్తుదారుడితో పాటు, ఎవరి ఓటుపై ఫిర్యాదు వచ్చిందో ఆ వ్యక్తికి కూడా ఈఆర్‌ఓ నోటీసులు జారీ చేసి విచారించాల్సి ఉంటుంది. ఒకవేళ కేవలం ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో లేదా తప్పుడు సమాచారంతో ఫిర్యాదు చేశారని తేలితే, సదరు ఫిర్యాదుదారుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చింది.
రాజకీయ పార్టీలకు ప్రత్యేక వెసులుబాటు
సాధారణ ఓటర్లకు పరిమితులు విధించినప్పటికీ, ఎస్‌ఐఆర్ సమయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లకు కొన్ని మినహాయింపులు ఇచ్చారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌కు ముందు రోజుకు 50 ఫామ్‌లు, డ్రాఫ్ట్ ప్రచురణ తర్వాత రోజుకు 10 ఫామ్‌ల చొప్పున బిఎల్ఓలకు సమర్పించేందుకు వీలు కల్పించారు. ఏది ఏమైనప్పటికీ, ఆధారాలు లేకుండా చేసే తప్పుడు ఫిర్యాదులను నిరోధించి, అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా తన ఓటు హక్కును కోల్పోకుండా చూసేందుకే ఈసీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.














Click it and Unblock the Notifications
