కేంద్రమంత్రి శోభపై చర్యలకు ఆదేశించిన ఈసీ: ఎందుకంటే?
బెంగళూరు: రామేశ్వరం కేఫ్ పేలుడుకు సంబంధించి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్రమంత్రి, బీజేపీ నాయకులు శోభా కరంద్లాజేపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది. మార్చి 1న బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడును ఉద్దేశిస్తూ.. తమిళనాడు నుంచి వచ్చిన వ్యక్తి బాంబు పెట్టాడని వ్యాఖ్యలు చేశారు.
అయితే, తమిళులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీంతో కేంద్రమంత్రి శోభపై చర్యలు తీసుకోవాలని బుధవారం పోల్ ప్యానెల్ ఆదేశించింది. శోభా కరంద్లాజే ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారని డీఎంకే ఫిర్యాదు నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కర్ణాటక ఎన్నికల అధికారిని ఆదేశించింది. ఈ అంశంపై 48 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని కోరింది.

కాగా, బెంగళూరులోని ఓ యువకుడు తన షాపులో హనుమాన్ చాలిసా పెట్టినందుకు మరో వర్గానికి చెందిన వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. దీనిపై బీజేపీ నిరసనకు పిలుపునిచ్చింది. పెద్ద ఎత్తున బీజేపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు బాధితుడికి సంఘీభావం తెలిపేందుకు వచ్చారు. కేంద్రమంత్రి కరంద్లాజే కూడా ఇక్కడికి వచ్చారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి శోభ మాట్లాడుతూ. కర్ణాటకలో శాంతిభద్రతలు క్షీణించాయని, తమిళనాడు నుంచి వచ్చినవారు బాంబులు వేస్తారని, ఢిల్లీ నుంచి వచ్చినవారు పాకిస్థాన్ జిందాబాల్ నిదాలు చేశారని, కేరళ నుంచి వచ్చిన వ్యక్తులు యాసిడ్ దాడులకు పాల్పడ్డారని చెప్పుకొచ్చారు. దీంతో ఆమె వ్యాఖ్యలపై డీఎంకే, కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. అయితే, తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు కేంద్రమంత్రి శోభ. తన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారని, తన మాటలతో ఎవరైనా నొచ్చుకుంటే.. అందుకు తాను క్షమాపణలు చెబుతున్నాన్నారు. అంతేగాక, తన వ్యాఖ్యలను ఉపసంహించుకుంటున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications