వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

EPFO: మీ పీఎఫ్‌ వడ్డీపై ఆదాయపు పన్ను కట్టాల్సిందేనా? కేంద్ర ప్రభుత్వ కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఆదాయపు పన్ను

ఉద్యోగుల భవిష్య నిధి (పీఎఫ్) వడ్డీపై ఆదాయపు పన్ను విధించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలులోకి తీసుకొచ్చింది.

తమ వాటాగా ఏడాదికి 2.5 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్)‌లో జమచేసే ఉద్యోగులపై ఆదాయపు పన్ను విధించడమే లక్ష్యంగా తాజా మార్పులు తీసుకొచ్చారు.

అంటే ఏడాదికి 2.5 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని ఉద్యోగులు తమ వాటాగా పీఎఫ్‌లో జమచేస్తే, ఆ అదనంగా జమచేసే దానిపై వచ్చే వడ్డీ మీద ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

ప్రభుత్వ ఉద్యోగులు లేదా ఉద్యోగ సంస్థలు ఎలాంటి నిధులనూ జమచేయని ఉద్యోగుల విషయంలో ఈ పరిమితిని రూ.5 లక్షలుగా నిర్దేశించారు.

ఈ కొత్త మార్పులను కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం నోటిఫై చేసింది. అయితే వీటిపై కొన్ని వర్గాల నుంచి ఆందోళన వ్యక్తం అవుతోంది.

నిర్మలా సీతారామన్

రెండు పీఎఫ్ ఖాతాలు

నిర్దేశిత పరిమితి దాటిన పీఎఫ్ నిధులపై పన్ను విధించబోతున్నట్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టే సమయంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టంచేశారు.

''కొంతమంది ప్రతి నెలా భారీగా నిధులను పీఎఫ్‌లో జమచేస్తున్నారు. వారికి వడ్డీతోపాటు ఆదాయపు పన్ను మినహాయింపు కూడా వస్తోంది. ఈ విధానం సరైనది కాదు’’ అని ఆమె అన్నారు.

తాజా మార్పులను నోటిఫై చేసేందుకు ఆదాయపు పన్ను నిబంధనలు-1962ల్లో కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) మార్పులు చేసింది.

''పీఎఫ్‌పై పన్నులను లెక్కించేందుకు ప్రస్తుత భవిష్య నిధి (పీఎఫ్) ఖాతాలోనే రెండు ప్రత్యేక ఖాతాలను ఏర్పాటు చేస్తారు. వీటిలో ఒకటి పన్ను వేసే ఖాతా, రెండోది పన్ను మినహాయింపు ఖాతా’’ అని ఆదాయపు పన్ను (25వ సవరణ)లో పేర్కొన్నారు.

తాజా సవరణ ప్రకారం.. పన్ను వర్తించే ఖాతాలోని పీఎఫ్ మొత్తాన్ని మాత్రమే ప్రస్తుతం సీబీడీటీ పరిగణనలోకి తీసుకుంటుంది.

''ఇకపై రెండు ఖాతాలను నిర్వహిస్తారు. ఏడాదికి రెండున్నర లక్షలకు మించని (అంటే పన్ను చెల్లించాల్సిన అవసరం లేని పెట్టుబడి) ఖాతాను, అలానే అంతకు మించి ఉన్న ఖాతాను ప్రత్యేకంగా నిర్వహిస్తారు. క్లోజింగ్ బ్యాలెన్స్ పద్ధతిలో దీన్ని లెక్కిస్తారు. దీని వల్ల ఏడాదికి రెండున్నర లక్షలకు మించి చేసే పెట్టుబడి మొత్తం ఎంత ఉంటుందో దాన్ని ప్రత్యేక ఖాతాలో పెట్టి.. దాని మీద వచ్చే వడ్డీపై కేంద్రం పన్ను విధించబోతోంది. నగదును ఉపసంహరించుకునేటప్పుడు అసలుపై కూడా పన్ను ఉంటుంది’’అని ట్యాక్స్ నిపుణుడు నాగేంద్ర సాయి బీబీసీతో చెప్పారు.

ఆదాయపు పన్ను

ఆ నిధులకు మినహాయింపు?

మార్చి 31, 2021కు ముందు ఖాతాలో ఉండే పీఎఫ్ నిధిపై ఎలాంటి పన్నూ ఉండదు. అంటే 2021-2022 వార్షిక సంవత్సరానికి ముందు మనం జమచేసిన పీఎఫ్ నిధులపై వచ్చిన వడ్డీపై ఎలాంటి పన్నూ విధించరు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి తమ వాటాగా రూ.2.5 లక్షల కంటే ఎక్కువ నిధులు జమచేసిన ఉద్యోగులపైనే తాజాగా ఆదాయపు పన్ను విధిస్తారు. వడ్డీపై మాత్రమే పన్ను ఉంటుంది.

ఉద్యోగ సంస్థలు తమ తరఫు నుంచి ఎలాంటి నిధులూ భవిష్య నిధిలో జమ చేయకపోతే ఈ పరిమితిని ఐదు లక్షలుగా నిర్దేశించారు. అంటే, ఇక్కడ ఉద్యోగి మాత్రమే పీఎఫ్ కడతారు. ఉద్యోగ సంస్థలు ఎలాంటి నిధులూ జమచేయవు.

2021 ఆగస్టునాటికి ఈపీఎఫ్‌వోలో 24.77 కోట్ల మంది ఖాతాదారులున్నారు. వీరిలో దాదాపు 5 కోట్ల మంది నుంచి ప్రతినెలా పీఎఫ్ నిధులు జమ అవుతుంటాయి.

దాదాపు అన్ని ప్రైవేటు సంస్థలూ తమ వాటాగా కూడా ఉద్యోగుల భవిష్య నిధిలో కొంత మొత్తాన్ని జమ చేస్తుంటాయి. ఈ రెండూ కలిపి నెల వారీ జీతంలో 12 శాతం వరకు ఉంటాయి.

ఆదాయపు పన్ను

వారే లక్ష్యంగా..

ముఖ్యంగా అధిక ఆదాయ వర్గాలు అంటే, 30 శాతానికి మించి పన్ను చెల్లిస్తున్న వారిని వేరు చేసి వారికి అందుతున్న బెనిఫిట్స్‌ను తగ్గించడానికి కేంద్రం తీసుకువచ్చిన ప్రణాళిక ఇదని నిపుణులు చెబుతున్నారు.

''ప్రస్తుతం దేశంలో పీఎఫ్ చెల్లిస్తున్న వారిలో 1.23 లక్షల మంది మాత్రమే అధిక ఆదాయాన్ని పొందుతున్నట్టు ప్రభుత్వ లెక్కలు చెబ్తున్నాయి. వీరంతా ఏడాదికి 50లక్షలకు మించి పన్నురహిత ఆదాయాన్ని (ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్) పొందుతున్నారు. ఇదంతా వాళ్ల పీఎఫ్ ఖాతాల్లో ఉన్న సొమ్ముపైనే’’ అని ట్యాక్స్ నిపుణుడు నాగేంద్ర సాయి వివరించారు.

''అధిక ఆదాయ వర్గాలు పీఎఫ్‌లో పెట్టుబడి పెట్టే సగటు వార్షిక మొత్తం రూ.6 కోట్లకు పైగానే ఉంటుంది. దీనిపై అస్యూర్డ్ అంటే.. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా కచ్చితంగా ప్రభుత్వం నుంచి వడ్డీ వస్తుంది. అది కూడా ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం లేకుండా’’

ఇలాంటి వర్గాలను లక్ష్యంగా చేసుకుంటూ తాజా మార్పులను ప్రతిపాదించారని నాగేంద్ర సాయి అన్నారు.

ఆదాయపు పన్ను

ఎప్పుడు వెల్లడించాలి?

ఆదాయపు పన్ను రిటర్నులను సమర్పించే సమయంలోనే పీఎఫ్‌పై వడ్డీని కూడా ఉద్యోగులు వెల్లడించాల్సి ఉంటుందని ఇదివరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) తెలిపింది.

అయితే ఈపీఎఫ్‌వోతోపాటు ఉద్యోగుల భవిష్య నిధిని నిర్వహించే ప్రత్యేక పీఎఫ్ ట్రస్టులు నేరుగా ఈ వడ్డీని ఉద్యోగుల ఖాతా నుంచి సేకరించి తమ వద్ద జమచేయాల్సి ఉంటుందని తాజాగా నిబంధనల్లో పేర్కొన్నారు.

మరోవైపు పన్ను విధింపునకు ఒకటి, పన్నేతర జమకు మరొకటి మొత్తం రెండు ఖాతాల నిర్వహణతో ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)పై భారం పడుతుందని ట్యాక్స్ నిపుణులు చెబుతున్నారు.

మరోవైపు భవిష్య నిధిని ప్రత్యేక ట్రస్టుల ద్వారా నిర్వహించే సంస్థలపైనా దీంతో అదనపు భారం పడుతుందని వివరిస్తున్నారు.

''ఇలా రెండు ఖాతాలు నిర్వహించడంతో అడ్మినిస్ట్రేషన్ భారం ఎక్కువగా ఉంటుంది. అధిక ఆదాయం ఉన్న వారు, పూర్తిగా పీఎఫ్ ద్వారా పెట్టుబడులు పెట్టేవారికి ఈ మార్పులు కాస్త ఇబ్బందిగా ఉంటాయి. ముఖ్యంగా కేంద్ర ఉద్యోగులను ఈ కొత్త నిబంధనలు ఎక్కువగా ఇబ్బంది పెడతాయి’’అని నాగేంద్ర వివరించారు.

''ఇప్పుడు పీఎఫ్ వడ్డీ రేటు 8.5 శాతంగా ఉంది. ఈ స్థాయి రాబడి వచ్చే పెట్టుబడి సాధనాలు ప్రస్తుతం మార్కెట్‌లో పెద్దగా లేవనే చెప్పుకోవాలి. పీఎఫ్‌లో అయితే ట్యాక్స్ ఫ్రీ కూడా. అందుకే ఎక్కువ ట్యాక్స్ కట్టేవారు వారు పీఎఫ్‌ను నమ్ముకుంటారు’’

''సామాన్యులపై తాజా మార్పుల ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. మరో టాక్స్ నిపుణుడు సత్య సాయ్ కుమార్‌ కూడా నాగేంద్ర వాదనతో ఏకీభవించారు.

''చాలావరకు ఉద్యోగుల పీఎఫ్ జమ ఏడాదికి రూ.2.5 లక్షలకు లోపే ఉంటుంది. చాలా కొద్ది మంది మాత్రమే అంతకుమించి పీఎఫ్‌లో పెట్టుబడులు పెడతారు. వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అలా పెట్టుబడులు పెట్టేవారిని అధిక ఆదాయ వర్గాలుగానే చూడాలి’’ అని సత్య సాయి కుమార్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
EPFO: Do you have to pay income tax on your PF interest? What do the new regulations of the Central Government say
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X