ఏపీకి చెందిన ఏటికొప్పాక బొమ్మల కొలువు- ఏరికోరి ఎంపిక చేసిన ప్రధాని మోదీ
ఢిల్లీ వేదికగా శనివారం ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కానున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు.. దౌత్య వ్యవహారాలకే పరిమితం కావట్లేదు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల కలయికకు వేదికగా నిలువబోతోంది. ఈ సమ్మిట్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ఎగ్జిబిషన్.. విదేశీ ప్రముఖులు, అతిథులను ఆకట్టుకుంటోంది. దేశంలోని వివిధ హస్తకళల వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా దాదాపు 70 అత్యంత విశిష్టమైన కళారూపాలు, చేనేత ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు.
ఇందులో హైలైట్ గా నిలిచింది.. ఏపీకి చెందిన ఏటికొప్పాక బొమ్మల కొలువు. వీటిని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) ఏరికోరి ఎంపిక చేసింది. ఈ విభాగం నేతృత్వంలో ఈ ఎగ్జిబిషన్ రూపుదిద్దుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 770 జిల్లాల్లో వ్యవసాయోత్పత్తులు, ఇతర హస్తకళలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. 1,200 కంటే ఎక్కువ విభిన్న ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయి గుర్తింపు, మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం.

దేశీయ కళలను అంతర్జాతీయ సదస్సుల ద్వారా ప్రపంచానికి పరిచయం చేసినట్టవుతుందని కేంద్రం చెబుతోంది. ఈ ఎగ్జిబిషన్ కు సంబంధించిన వివరాలను వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికారిణి సోనియా దుహన్ వెల్లడించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సేకరించిన వస్తువులు, కళాఖండాలను ఇందులో ప్రదర్శనకు ఉంచినట్లు చెప్పారు. ప్రస్తుతం దేశంలో 750కి పైగా జిల్లాలను దీని పరిధిలోకి తీసుకొచ్చామని, ప్రతి జిల్లా నుండి కూడా ఓ ప్రత్యేక గుర్తింపు గల ఉత్పత్తులను ఎంపిక చేశామని అన్నారు.
ఈ ఉత్పత్తుల ఎగుమతులను పెంచడానికి, వీటికి అంతర్జాతీయ గుర్తింపును తీసుకుని రావడానికి జాతీయ స్థాయిలో కృషి చేస్తోన్నట్లు సోనియా దుహన్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ రాయబార కార్యాలయాలు, దౌత్య విభాగాలతో కలిసి ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తోన్నామని అన్నారు. స్థానిక ఉత్పత్తులకు విదేశాల్లో ఎలాంటి ఆదరణ ఉంది, వాటిని ఎలా మరింత ముందుకు తీసుకెళ్లాలి, ఎగుమతి అవకాశాలు ఎలా మెరుగుపరచాలి, వాటి అంతర్జాతీయ ప్రమాణాల ప్యాకేజింగ్ ఎలా ఉండాలనే అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు.
VIDEO | The “One District, One Product” exhibition at the 18th BRICS Summit in Delhi has become a special attraction for foreign guests, showcasing 70 unique art and handloom products from across India.
— Press Trust of India (@PTI_News) September 11, 2026
Organised by the Department for Promotion of Industry and Internal Trade,… pic.twitter.com/UgqS4qZm61
ఈ ప్రదర్శన.. దేశ గ్రామీణ కళాకారులు, నేత కార్మికులకు గొప్ప ఆర్థిక భరోసాను కల్పిస్తుందని కేంద్రం అభిప్రాయపడుతోంది. దేశ సంస్కృతిలో భాగమైన సాంప్రదాయ ఉత్పత్తులను గ్లోబల్ మార్కెట్‌లో నిలబెట్టడం ద్వారా చిన్నతరహా పరిశ్రమల మనుగడకు మార్గం సుగమం అవుతుంది. బ్రిక్స్ వంటి శిఖరాగ్ర సదస్సులలో ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం వల్ల విదేశీ కొనుగోలుదారులు భారతీయ మార్కెట్ వైపు ఆకర్షితులవుతారు.













Click it and Unblock the Notifications
