ఎగ్జిట్ పోల్స్‌ను బీజేపీ నిజంగానే మేనేజ్ చేసిందా?
Exit Polls 2024: దేశవ్యాప్తంగా చివరి విడత లోక్‌సభ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ వెలువడటం ఆరంభమైంది. సాయంత్రం 6:30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ సందడి మొదలైంది. ఏపీలో జరిగిన 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ, తెలంగాణలో 17 లోక్‌సభ నియోజకవర్గాలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు విడుదల అవుతున్నాయి.
జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు సందర్భంగా వెలువడే ఫలితాలకు ఇంచుమించుగా సరిపోయేలా ఇవి ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. జాతీయ స్థాయిలో సర్వే సంస్థలు, ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా భారతీయ జనతా పార్టీకే జై కొట్టాయి. ఎన్డీఏ కూటమి వైపే మొగ్గు చూపాయి.

కొన్ని సర్వే సంస్థలు ఏ మాత్రం నమ్మశక్యం కాని విధంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలను వెల్లడించడం సైతం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉదాహరణకు ఏబీపీ సీ- ఓటర్, ఇండియా టీవీ సీఎన్ఎక్స్, ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా వంటివి ఏపీపై విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఏ మాత్రం ఊహకు అందనివే.
ఏపీలో లోక్‌సభ స్థానాల్లో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ 20కి పైగా నియోజకవర్గాలను గెలుచుకుంటాయని అంచనా వేశాయవి. అలాగే- మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ సంస్థలు కూడా వైసీపీకి లోక్‌సభలో సింగిల్ డిజిట్ కంటే తక్కువ సీట్లే వస్తాయంటూ అభిప్రాయపడ్డాయి.
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకీ అతి తక్కువ సీట్లను కేటాయించాయా సంస్థలన్నీ తమ నివేదికల్లో. వరుసగా మూడోసారి ఎన్డీఏ అధికారంలోకి రాబోతోందని, బీజేపీ మళ్లీ సొంతంగా 300లకు పైగా నియోజకవర్గాలను దక్కించుకుంటుందంటూ తమ అంచనాలను బయటపెట్టాయి.
ఈ పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ ఘాటుగా స్పందించింది. ఎగ్జిట్ పోల్స్‌ను ఎన్డీఏ మేనేజ్ చేసిందంటూ ఆరోపించింది. తనకు అనుకూలమైన రీతిలో మలచుకుందని మండిపడింది. వీటిని తాము విశ్వసించట్లేదని, జూన్ 4వ తేదీన వెలువడే ఫలితాలను మాత్రమే నమ్ముతామని, జనాభిప్రాయం అక్కడే స్పష్టమౌతుందని పేర్కొంది.
జూన్ 4వ తేదీన ఎగ్జిట్ కానున్న వ్యక్తి (ప్రధానమంత్రి నరేంద్ర మోదీ) ఈ ఎగ్జిట్ పోల్‌లను రూపొందించారంటూ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ విమర్శించారు. ఇండియా కూటమి ఖచ్చితంగా కనీసం 295 సీట్లను సాధిస్తుందని ఆయన అన్నారు. ఇది స్పష్టమైన నిర్ణయాత్మక మెజారిటీగా అభివర్ణించారు.
అవుట్ గోయింగ్ ప్రధానమంత్రి ఈ మధ్యకాలంలో మూడు రోజుల పాటు స్మగ్‌గా ఉండాలనే ఉద్దేశంతోనే ఎగ్జిట్ పోల్స్‌ను రూపొందించారని ఎద్దేవా చేశారు జైరామ్ రమేష్. ఇవన్నీ కూడా అవుట్ గోయింగ్ ప్రధాని సూత్రధారిగా ఆడిన మైండ్ గేమ్ మాత్రమేనని వ్యాఖ్యానించారు. వాస్తవ ఫలితాలు మాత్రం వీటికి భిన్నంగా ఉంటాయని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications