మహారాష్ట్రలో బీజేపీదే హవా: శివసేన మద్దతిస్తుందా?
ముంబై: శాసన సభ ఎన్నికలు జరిగిన మహారాష్ట్ర, హర్యానాల్లో భారతీయ జనతా పార్టీ హవా కనపడనుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. మిగిలిన పార్టీల కంటే బీజేపీకే ఎక్కువ స్థానాలు లభిస్తాయని చెబుతున్నాయి. మహారాష్ట్రలో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చి మేజిక్ ఫిగర్ దాటకుంటే శివసేన మద్దతుస్తుందా అనే ప్రశ్న ఇప్పుడు అందర్నీ తొలుస్తోంది. బీజేపీ నేతను సీఎంగా అంగీకరిస్తారా లేక పంచుకుంటారా అనేది తేలాల్సి ఉంటుంది.
ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సగానికంటే ఎక్కువ సీట్లను హర్యానాలో బీజేపీ సాధిస్తుందని రెండు సర్వేలు తెలిపాయి. మహారాష్ట్రలో బీజేపీకి సగం స్థానాలు వస్తాయని ఓ సర్వే, అతిపెద్ద పార్టీగా మాత్రమే అవతరిస్తుందని మరికొన్ని సర్వేలు చెబుతున్నాయి. 2009తో పోలీస్తే బీజేపీకి, శివసేనకు సీట్లు పెరుగుతాయని, మిగిలిన పార్టీలు ఆ మేరకు నష్టపోతాయని ఏబీపీ-ఏసీ నీల్సన్ సర్వే తెలిపింది.
15 ఏళ్లుగా మహారాష్ట్రను పాలిస్తూ ఈ ఎన్నికల్లో విడిగా పోటీ చేసిన కాంగ్రెస్, ఎన్సీపీలు బాగా నష్టపోతాయని సర్వేలు చెబుతున్నాయి. 90 స్థానాలున్న హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సీట్లు బీజేపీకి వస్తాయని టుడేస్ చాణక్య, ఏసీ నీల్సన్ సర్వేలు చెప్పాయి.

నరేంద్ర మోడీ 27 సభల్లో ప్రసంగించి చూపించిన ప్రభావంతో హర్యానాలో తొలిసారిగా బీజేపీ సొంత ప్రభుత్వం రాబోతోందని టూడేస్ చాణక్య చెప్పింది. హర్యానాలో బీజేపీకి 45 స్థానాలు వస్తాయని ఇండియా టుడే సర్వే చెప్పింది. రెండు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ఈ నెల 19వ తేదీన జరగనుంది.
మహారాష్ట్రలో...
సీ ఓటర్-టైమ్స్ నౌ ప్రకారం బీజేపీకి 129, శివసేనకు 56, కాంగ్రెస్‌కు 43, ఎన్సీపీకి 36, ఎంఎన్ఎస్‌కు 12, ఏబీపీ-ఏసీ నీల్సన్ ప్రకారం బీజేపీకి 144, శివసేనకు 77, కాంగ్రెస్‌కు 30, ఎన్సీపీకి 29, ఎంఎన్ఎస్‌కు 3, ఇండియా టీవీ ప్రకారం బీజేపీకి 124-134, శివసేనకు 51-61, కాంగ్రెస్‌కు 38-48, ఎన్సీపీకి 31-41, ఎంఎన్ఎస్‌కు 9-15, టుడేస్ చాణక్య ప్రకారం బీజేపీకి 151, శివసేనకు 71, కాంగ్రెస్‌కు 27, ఎన్సీపీకి 28, ఎంఎన్ఎస్‌కు 11 వస్తాయి.
హర్యానాలో...
సీ ఓటర్-టైమ్స్ నౌ ప్రకారం బీజేపీకి 37, ఐఎన్ఎల్డీకి 28, కాంగ్రెస్‌కు 15, హెచ్‌జేసీకి 6, టుడేస్ చాణక్య ప్రకారం. బీజేపీకి 52, ఐఎన్ఎల్డీకి 23, కాంగ్రెస్‌కు 10, ఏసీ నీల్సన్ ప్రకారం బీజేపీకి 54, ఐఎన్ఎల్డీకి 22, కాంగ్రెస్‌కు 10, హెచ్‌జేసీకి 2 వస్తాయి.












Click it and Unblock the Notifications