ఎట్లిచ్చిన.. నాతోనే మాజాకాలా
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి వెనిజులాకు చెందిన ప్రతిపక్ష నాయకురాలు, మానవ హక్కుల ఉద్యమకర్త మరియా కొరినా మచాడోకు లభించింది. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విశ్వ ప్రయత్నాలు చేశారు గానీ అవి సత్ఫలితాలను ఇవ్వలేకపోయాయి.. కార్యరూపాన్ని దాల్చలేకపోయాయి. ట్రంప్ కోసం పెద్ద ఎత్తున లాబీయింగ్ జరిగినప్పటికీ.. ఆయనకు నిరాశే ఎదురుకావడం చర్చనీయాంశమౌతోంది.
నోబెల్ శాంతి బహుమతి కోసం డొనాల్డ్ ట్రంప్ సహా మొత్తం 338 మంది నామినేట్ అయ్యారు. వారిలో మారియాకు మాత్రమే ఆ అదృష్టం దక్కింది. కంబోడియా-థాయ్‌లాండ్, కొసావో-సెర్బియా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో -రువాండా, పాకిస్థాన్- భారత్, ఇజ్రాయెల్-ఇరాన్, ఈజిప్ట్-ఇథియోపియా, అర్మేనియా-అజర్‌బైజాన్ మధ్య యుద్ధాలను ముగించానని ట్రంప్ చెప్పుకొన్నారు. ఫలితంగా వేలాదిమంది ప్రాణాలను కాపాడాననీ పేర్కొన్నారు.

అలాగే- ఇజ్రాయెల్, గాాజా మధ్య శాంతియుత వాతావరణం నెలకొనడానికీ తానే కారకుడినయ్యాననీ స్వయంగా ప్రకటించారుకున్నారు. అందుకే ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతిని అందుకోవడానికి తాను అర్హుడిననీ అన్నారు. దీనికి అనుగుణంగా పలు దేశాధినేతలు, ప్రధానమంత్రులు ఆయన పేరును స్వయంగా నామినేట్ చేశారు కూడా. పాకిస్తాన్, ఇజ్రాయెల్ వంటి దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. అయినప్పటికీ, ఆయనకు నోబెల్ శాంతి బహుమతి దక్కలేదు. ట్రంప్‌కు అవార్డు రాకపోవడానికి కొన్ని నిర్దుష్ట కారణాలున్నాయి.
- పాకిస్తాన్ తో యుద్ధాన్ని నివారించడంలో డొనాల్డ్ ట్రంప్ పాత్ర ఎంతమాత్రం లేదని ముందు నుంచీ చెబుతూ వస్తోంది భారత్. రెండు దేశాల సైన్యాధికారుల చర్చల వల్లే యుద్ధం ముగిసిందనీ ఎప్పటికప్పుడు తేల్చింది. ఈ విషయంలో ట్రంప్ వాదనలను పలుమార్లు తోసిపుచ్చింది కూడా. ఈ కారణంతో ఆయన పేరును నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయడానికి భారత్ ఇష్టపడ లేదనీ చెబుతున్నారు.
- అలాగే- ఇష్టానుసారంగా టారిఫ్ విధించడం కూడా డొనాల్డ్ ట్రంప్ కు మైనస్ పాయింట్ గా మారిందనే అభిప్రాయాలు ఉన్నాయి. అదే సమయంలో రష్యాను రెచ్చగొట్టేలా వ్యవహరించడం, ఆ దేశంతో క్రూడాయిల్ ను కొనుగోలు చేస్తోన్న భారత్ సహా ఇతర యూరోపియన్ దేశాలను కూడా పరోక్షంగా హెచ్చరికలు జారీ చేయడం వంటివి.. కొంత వరకు ఉద్రిక్తతలను పెంచడానికి కారణం అయ్యాయనే వాదనలు ఉన్నాయి.
- ట్రంప్ జనవరి 20న పదవీ బాధ్యతలు స్వీకరించగా, జనవరి 31తో నోబెల్ అవార్డు నామినేషన్ల గడువు ముగిసింది. ఆయన నామినేషన్లన్నీ కూడా గడువు తీరిన తర్వాత నోబెల్ కమిటీకి అందాయనే చెబుతున్నారు.
- ట్రంప్ ఎనిమిది యుద్ధాలను ఆపినట్లు పేర్కొంటూ నోబెల్ శాంతి బహుమతిని ఆశించినప్పటికీ, అవన్నీ కూడా జనవరి 31 తర్వాత సాధించినవి. ఫలితంగా ప్రస్తుత సంవత్సరానికి ఆయనకు నోబెల్ శాంతి బహుమతికి అర్హత లేకుండా పోయిందని అంచనా వేస్తోన్నారు. 2026 నోబెల్ శాంతి బహుమతికి ఆయన పేరు పరిశీలించే అవకాశం ఉండొచ్చు.












Click it and Unblock the Notifications