బెంగాల్లో ఇవాళ మోదీ వర్సెస్ దీదీ - హుగ్లీలో పోటాపోటీ ర్యాలీలు- వీకెండ్ వార్
తృణణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా సాగిపోతున్న పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో భాగంగా ఇవాళ హుగ్లీలో జరిగే ప్రచార ర్యాలీల్లో ప్రధాని మోడీ, సీఎం మమతా బెనర్జీ పాల్గొనబోతున్నారు. ఒకే నగరంలో ఒకే రోజు ప్రధాని మోడీ, మమత ర్యాలీలు ఉండటంతో ఉత్కంఠ రేగుతోంది. ఇప్పటికే వీరిద్దరూ ప్రచార పర్వంలో భాగంగా పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్న నేపథ్యంలో ఇవాళ హుగ్లీ వేదికగా మరో వీకెండ్ వార్ తథ్యమని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
హుగ్లీ జిల్లాలోని ఆరామ్‌బాగ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ప్రధాని మోడీ, మమతా బెనర్జీ ప్రచార ర్యాలీలు ప్లాన్ చేసుకున్నారు. తారకేశ్వర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మమతా బెనర్జీ మధ్యాహ్నం ఒంటిగంటన్నరకు జరిగే సభలో పాల్గొనబోతుండగా.. గంట విరామం తర్వాత సమీపంలోనే ఉన్న హరిపాల్ నియోజకవర్గంలో ప్రధాని మోడీ రెండున్నర గంటల తర్వాత జరిగే ర్యాలీలో పాల్గొనబోతున్నారు. తారకేశ్వర్ నియోజకవర్గం ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం కాగా.. ఇక్కడ మూడో దశలో ఎన్నికలు జరగబోతున్నాయి.

రెండోదశలో భాగంగా ఎన్నికలు జరిగిన నంద్రిగ్రామ్‌లో పోటీ చేసిన సీఎం మమతా బెనర్జీ తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుండగా.. బీజేపీ నేతలు మాత్రం అదే పనిగా ఆమె అక్కడ ఓడిపోతోందని, మరో నియోజకవర్గం వెతుక్కోవడం ఖాయమని ప్రచారం చేస్తున్నారు. నిన్న జరిగిన బెంగాల్ రెండో దశ ఎన్నికల్లో నందిగ్రామ్‌లో 80 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. దీంతో పెరిగిన పోలింగ్ శాతం తమకు అనుకూలిస్తుందని మమత, కాదు మాకే అనుకూలమని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు.












Click it and Unblock the Notifications