అమిత్ షా ఫోన్, ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారానికి ఉద్ధవ్
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో తొలి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బీజేపీకి చెందిన 10 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని సమాచారం. వీరిలో దివంగత నేత గోపినాథ్ ముండే కుమార్తె పంకజా ముండే కూడా ఉన్నారు.
బీజేపీ కోర్ కమిటీ సభ్యులు ఏక్ నాథ్ ఖడ్సే, సుధీర్ మనగంటివార్, వినోద్ తవ్డే, పంకజ ముండే, ముంబై బీజేపీ మాజీ అధ్యక్షుడు ప్రకాశ్ మోహతా, పాల్గర్ జిల్లాకు చెందిన గిరిజన నాయకుడు విష్ణు సవ్‌రా, చంద్రాకాంత్ పాటిల్, విద్య ఠాకూర్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
శివసేన్ అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరేకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఫోన్ చేసి ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని కోరినట్లు తెలిసింది. దీంతో ప్రమాణ స్వీకారానికి హాజరవడానికి ఉద్ధవ్ థాకరే అంగీకరించారు.

నిన్నటి వరకు బీజేపీ-శివసేన మధ్య చర్చలు జరుగుతుండటంతో ప్రమాణ స్వీకారానికి రావడానికి విముఖత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఐతే ఇప్పుడు స్వయంగా బీజేపీ రధసారధి ఫోన్ చేసి ఆహ్వానించడంతో వారి ఆహ్వానాన్ని ఉద్ధవ్ థాకరే మన్నించారు.
దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ సీకారోత్సవానికి భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2011లో భారత క్రికెట్ జట్టు ప్రపంచకప్‌ను కైవశం చేసుకున్న వాంఖడే స్టేడియంలో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మహారాష్ట్రలో బీజేపీ మొదటిసారి ప్రభుత్వ ఏర్పాటు చేస్తున్న ఆ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ సహా బీజేపీ అగ్రనేతలు హాజరు కానున్నారు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో నిర్వహించే వేడుకకు సుమారు 40 వేల మంది హాజరు అవుతారని అంచనా.
శుక్రవారం నాడు మహారాష్ట్రలో ఏర్పడబోయే ప్రభుత్వంలో శివసేన సభ్యులు చేరడం లేదని బీజేపీ నేత రాజీవ్ ప్రతాఫ్ రూడీ స్పష్టం చేశారు. శివసేన పార్టీతో జరుపుతున్న చర్చలు సానుకూలంగా ముగస్తాయన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు
ఫడ్నవీస్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం ముంబై వెళుతున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆయనను మహారాష్ట్ర సర్కార్ ఆహ్వానించింది. ఈ కారణంగా శుక్రవారం విశాఖలో బాబు పర్యటన రద్దయింది.












Click it and Unblock the Notifications