‘‘ఇంత మంచి చాన్స్ వదులుకోకండి.. ఆ ఆఫర్ కు ఓకే చెప్పండి.. నా మాట విని ఒప్పుకోండి.. ప్లీజ్’’
కశ్మీర్ సమస్య పరిష్కారానికి అమెరికా మధ్యవర్తిత్వానికి భారత్, పాక్ అంగీకరించాలంటూ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ప్రాధేయపడడం వివాదాస్పదమైంది.
శ్రీనగర్: కశ్మీర్ సమస్య పరిష్కారానికి ఎన్ని రకాల ప్రత్యామ్నాయలుంటే అన్నింటిని వినియోగించుకోవాలని, అమెరికా మధ్యవర్తిత్వాన్ని అసలు కాలదన్నుకోవద్దని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్ సి) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా కోరారు.
భారత్-పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలను నివారించేందుకు, శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు, కశ్మీర్ సమస్య పరిష్కారానికి తాము సిద్ధమంటూ అమెరికా రాయబారి నిక్కీ హేలీ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో.. ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న ఈ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమంటూ అమెరికా చేసిన ప్రతిపాదనకు భారత్, పాకిస్తాన్ రెండూ ముందుకు రావాలని, అందుకు అంగీకరించాలని ఆయన పేర్కొన్నారు.
అయితే అమెరికా రాయబారి నిక్కీ హేలీ ప్రతిపాదనపై భారత్ వెంటనే ఒక ప్రకటన చేసింది. కశ్మీర్ విషయంలో తాము మూడో వ్యక్తి జోక్యానికి అనుమతించబోమంటూ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఫరూక్ అబ్దుల్లా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది.
అయితే కశ్మీర్ సమస్యను పరిష్కరించుకోవడంలో 70 ఏళ్లుగా భారత్, పాక్ విఫలమయ్యాయని, కొన్ని వేల మంది జీవితాలను బలితీసుకుంటున్న ఈ సమస్య పరిష్కారానికి అమెరికా ముందుకొచ్చింది కాబట్టి.. మధ్యవర్తిత్వం సహా అన్ని రకాల ప్రత్యామ్నాయాలకు ఇరు దేశాలు ప్రాధాన్యం ఇవ్వాలని తాను ప్రాధేయపడుతున్నాని, ఇకనైనా ఈ అపరిష్కృత సమస్యకు ముగింపు పలకాలంటూ ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications