రహస్య సమావేశం: నటి జయప్రదపై ఎఫ్ఐఆర్ నమోదు
లక్నో: ప్రముఖ సినీ నటి, ఆరెల్డీ నేత జయప్రదపై శుక్రవారం ఎఫ్ఐఆర్ నమోదైంది. ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్ లోక్ సభ స్థానానికి పోటీ చేస్తున్న ఆమె మంగళవారం అర్థరాత్రి సమయంలో ప్రచారం నిర్వహించారనే అభియోగాలపై కేసు నమోదు చేశారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం అలాంటి సమావేశాలు నిర్వహించడం నేరం. దాంతో ఆమెపై అభియోగాలు నమోదు చేశారు.
రహస్యంగా నిర్వహించిన ఆ సమావేశం విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంతకుముందు, జయప్రద వాహనంపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. దానిపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. దాని వెనుక ఎస్పీ ఎమ్మెల్యే ఒకరు ఉన్నట్లు ఆరోపించారు. ఆ దాడి నేపథ్యంలో అర్థరాత్రి సమావేశం జరిగినట్లు తెలుస్తోంది.

జయప్రదపై జరిగిన దాడిపై ఆమె పిఆర్వో చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు జరుగుతుండగా రహస్య సమావేశం గురించి తెలిసిందని పోలీసు సూపరింటిండెంట్ అనీస్ అహ్మద్ అన్సారీ చెప్పారు. కాజీపడ మొహల్లాలో ఓ గుర్తు తెలియని యువకుడు జయప్రద కారుపై రాయి విసిరాడు. ఈ ఘటనలో ఓ ప్రైవేట్ గార్డు గాయపడ్డాడు.
గత ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా రాంపూర్ లోకసభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించిన జయప్రద ప్రస్తుతం ఆర్‌ఎల్‌డి తరఫున బిజ్నోర్ నుంచి పోటీ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications