ఆ జడ్జి ఇంట్లో ఎలాంటి డబ్బూ దొరకలేదట!
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో భారీగా డబ్బు లభించిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా, ఈ ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ పెద్ద మొత్తంలో నగదు దొరికినట్లు ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటన విషయంలో తప్పుడు సమాచారం, పుకార్లు వ్యాప్తి చెందుతున్నాయని పేర్కొంది.
జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలనే ప్రతిపాదన, అంతర్గత విచారణ ప్రక్రియ రెండూ వేర్వేరు పరిణామాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకే ఉపాధ్యాయ ఈ ఘటనకు సంబంధించిన ఆధారాలు సేకరించే అంతర్గత విచారణ ప్రక్రియ ప్రారంభించారని తెలిపింది. దీనికి సంబంధించిన నివేదికను శుక్రవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాకు సమర్పిస్తారని వెల్లడించింది. ఆ నివేదిక తర్వాతే సుప్రీంకోర్టు అవసరమైన తదుపరి చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేసింది.

ఇది ఇలావుంటే, ఢిల్లీ న్యాయమూర్తి ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో మంటలు ఆర్పేందుకు వచ్చిన సిబ్బందికి అసలు ఎలాంటి నగదు కనిపించలేదని ఢిల్లీ పైర్ సర్వీసెస్ చీఫ్ అతుల్ గార్గ్ చెప్పడం గమనార్హం. అంతకుముందు జరిగిన పరిణామాలు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉండటం చర్చనీయాంశంగా మారాయి.
ఢిల్లీ జడ్జీ ఇంట్లో ఏం జరిగింది?
ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో మార్చి 14వ తేదీన అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో మంటలు ఆర్పేందుకు వెళ్లిన అగ్నిమాపక సిబ్బందికి అనుకోకుండా అక్కడ భారీ మొత్తంలో డబ్బు కనిపించింది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో జస్టిస్ జశ్వంత్ వర్మ నగరంలో లేరు. ఆయన కుటుంబసభ్యులే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు ఫోన్ చేసి పిలిపించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశారు.
అయితే, అక్కడ భారీ ఎత్తున నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో.. ఆ మొత్తం నగదును స్వాధీనం చేసుకున్నారు. అదంతా లెక్కల్లో చూపని నగదుగా గుర్తించారు. వెంటనే ఈ విషయం ఉన్నతాధికారుల ద్వారా సీజేఐ సంజీవ్ ఖన్నాకు చేరింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన సీజేఐ.. వెంటనే కొలీజియం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ వర్మను అలహాబాద్‌కు బదిలీ చేశారు. అయితే, న్యాయవ్యవస్థలో ఈ ఘటన సంచలనంగా మారింది.
చెత్త కుండీ కాదంటూ అలహాబాద్ బార్ అసోసియేషన్ అసహనం
డబ్బు కట్టలు దొరికిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయడాన్ని అక్కడి బార్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది 'చెత్త కుండీ' కాదంటూ తీవ్రంగా స్పందించింది. జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసినట్లు సమాచారం అందగానే ఈ మేరకు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది అనిల్ తివారీ పేరుతో ఓ తీర్మానం చేసింది.












Click it and Unblock the Notifications