సేఫ్ జోన్: ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ 'డిస్కౌంట్' జిమ్మిక్కు!
న్యూఢిల్లీ: ఈ నెల 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఈ కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు భారీగా ఆఫర్‌లతో వస్తువులను అమ్మదలిచినట్లు ప్రకటించాయి. అయితే, ఈ కామర్స్ సంస్థలు రక్షణాత్మక ధోరణి అవలంభిస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
భారీ ఆఫర్ అని చెప్పినప్పటికీ... ఆ ఆఫర్ కేవలం పాత మోడల్స్ పైనే ఎక్కువగా ఉందని, కొత్త ఉత్పత్తుల పైన లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. దసరా పండుగ నేపథ్యంలో అమ్మకాలు పెంచుకొని, లాభాలు మూటగట్టుకోవాలని భావించే ఈ కామర్స్ కంపెనీలు.. స్మార్ట్ ఫోన్ యాప్‌ల మాధ్యమంగా కస్టమర్లను మోసం చేస్తున్నాయని నిపుణులు విమర్శిస్తున్నారు.
ఎనభై శాతం వరకూ భారీ డిస్కౌంట్లని, అంతకుమించిన క్యాష్ బ్యాక్ వంటి ఆఫర్లను ప్రకటించి కస్టమర్లను ఆకర్షించిన కంపెనీలు, కేవలం పాతవి, అమ్ముడు పోకుండా మిగిలిన ఉత్పత్తుల పైనే భారీ ఆఫర్లు ఇస్తున్నాయని అంటున్నారు.

మైక్రోమాక్స్, ఒనిడా, బిపిఎల్, మోటరోలా వంటి కంపెనీల పాత మోడల్స్‌కు చెందిన గాడ్జెట్లు, స్మార్ట్‌ఫోన్లను వదిలించుకునేందుకు ఈ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అమేజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు ప్రారంభించిన అమ్మకాల్లో కంటికి ఆకర్షణీయంగా ప్రకటనలు మాత్రమే కనిపిస్తున్నాయని, లోతుగా వెళ్తే.. పెద్దగా ప్రయోజనాలేమీ లేవంటున్నారు.
స్మార్ట్ ఫోన్ల విషయంలోనే కాకుండా... అప్పెరల్స్, యాక్సెసరీస్ విషయంలోనూ ఇదే కనిపిస్తోందంటున్నారు. గత సంవత్సరం తాజా ఐఫోన్లు, శ్యాంసంగ్ గెలాక్సీ ఫోన్లు, సోనీ టీవీలను మంచి డిస్కౌంట్ ధరలకు అందించిన ఇవే కంపెనీలు ఈ దఫా చౌక బ్రాండ్లకు మాత్రమే పరిమితమయ్యాయంటున్నారు.
మా సరికొత్త దుస్తుల రకాలకు డిస్కౌంట్లను ఇవ్వడం లేదని, గత సీజనులో మిగిలిపోయిన స్టాక్స్ మాత్రమే ఆఫర్లలో విక్రయిస్తున్నామని అరవింద్ లైఫ్ స్టయిల్ బ్రాండ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జే సురేష్ వ్యాఖ్యానించడం పరిస్థితిని చెప్పకనే చెబుతోందంటున్నారు.












Click it and Unblock the Notifications