కర్ణాటక నుంచి నిర్మల - తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికి : బీజేపీ నుంచి రాజ్యసభకు వీరే..!!
పెద్దల సభకు పెద్ద సంఖ్యలో ఖాళీలు ఏర్పడటంతో...బీజేపీ - కాంగ్రెస్ తమ అభ్యర్దులను ఖరారు చేస్తోంది. కేంద్రంలోని అధికార బీజేపీకి రాజ్యసభలో సంఖ్యా బలం పెంచుకోవటం అనివార్యంగా మారింది. జూన్ 10న ఎన్నికలు జరిగే 57 రాజ్యసభ సీట్లలో బీజేపీకి 23 సీట్లు దక్కనున్నాయి. వాటిలో 16 సీట్లకు అభ్యర్థులను ప్రకటించగా మిగతా ఏడు సీట్లకు ఇంకా ప్రకటించాల్సి ఉంది.
కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌ను కర్ణాటక నుంచి, పీయూష్ గోయల్‌ను మహారాష్ట్ర నుంచి అభ్యర్ధులుగా ఎంపిక చేసింది. ప్రస్తుతం వీరు అవే రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కర్ణాటక నుంచి బీజేపీకి రెండు, కాంగ్రెస్ కు ఒకటి, జేడీఎ్‌సకు ఒకటి దక్కే అవకాశం ఉంది.

16 మందితో జాబితా విడుదల
మధ్యప్రదేశ్ నుంచి కవితా పాటీదార్, కర్ణాటక నుంచి సినిమా నటుడు, బీజేపీ అధికార ప్రతినిధి జగ్గేశ్, మహారాష్ట్ర నుంచి మాజీ ఎమ్మెల్సీ అనిల్ సుఖ్ దేవ్ రావ్ బోండే, రాజస్థాన్ నుంచి మాజీ మంత్రి ఘన్ శ్యామ్ తివారీ, ఉత్తర ప్రదేశ్ నుంచి బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మీకాంత్ వాజపేయి, గోరఖ్ పూర్ మాజీ ఎమ్మెల్యే రాధా మోహన్ దాస్ అగర్వాల్, బీఎస్పీ మాజీ ఎంపీ సురేంద్ర సింగ్ నాగర్, నిషాద్ వర్గం నేత బాబూరామ్ నిషాద్, జాతీయ ఉపాధ్యక్షురాలు దర్శనా సింగ్, ఉత్తరాఖండ్ ఓబీసీ కమిషన్ చైర్ పర్సన్ కల్నా సైనీ, బీహార్ నుంచి సతీశ్ చంద్ర దుబే, శంభు శరణ్ పటేల్, హరియాణా నుంచి కిషన్ లాల్ పన్వర్‌కు బీజేపీ అవకాశమిచ్చింది.

తెలుగు రాష్ట్రాలకు ఛాన్స్ దక్కేనా
కాగా.. మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పేరును ఈ జాబితాలో చేర్చలేదు. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు బీజేపీ నేతలు తమకు ఇతర రాష్ట్రాల నుంచి రాజ్యసభకు అవకాశం వస్తుందనే ఆశతో ఉన్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రాజ్యసభలోజీవీఎల్ నర్సింహారావు ఒక్కరే ఉత్తరప్రదేశ్ నుంచి బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా, రానున్న ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కీలకంగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ..తెలంగాణ నుంచి ఒకరికి రాజ్యసభకు ఎంపిక చేస్తారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.

రెండో జాబితా పై ఆశాభావం
అదే సమయంలో ఏపీ నుంచి పదవీ విరమణ చేసిన వారిలో టీడీపీ నుంచి బీజేపీలో చేరిన టీజీ వేంకటేష్.. సుజనా చౌదరి సైతం తిరిగి బీజేపీ నుంచి పెద్దల సభలో అవకాశం కోసం ఆశాభావంతో ఉన్నారు. దీంతో.. మిగిలిన ఏడు సీట్లలో ఒకటి తెలుగు నేతలకు ఖాయమని చెబుతున్నారు. ఆ సీటు తెలంగాణకు ఇస్తారా..లేక, ఏపీ నుంచి అవకాశం కల్పిస్తారా అనేది ఇప్పుడు పార్టీలో చర్చకు కారణమవుతోంది. మిగిలిన ఏడు స్థానాలకు అభ్యర్దులను పార్టీ ఈ రోజు ఖరారు చేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications