ఉడుపి సింగం: 33 ఏళ్లకే ఐపీఎస్‌కు గుడ్‌బై: పాలిటిక్స్‌లోకి: తెలంగాణ బీజేపీ నేత సమక్షంలో
న్యూఢిల్లీ: ఊహించిందే జరిగింది. ఉడుపి సింగంగా కర్ణాటకలో పేరు తెచ్చుకున్న యంగ్ అండ్ డైనమిక్ ఐపీఎస్ అధికారి అన్నామలై కుప్పుస్వామి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీలో చేరారు. కొద్దిసేపటి కిందట దేశ రాజధానిలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో ఆయన బీజేపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. తెలంగాణకు చెందిన సీనియర్ నేత, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు ఎల్ మురుగన్ ఆయనకు పార్టీ కండువాను కప్పి, సాదరంగా ఆహ్వానించారు. అన్నామలై కుప్పుస్వామి వయస్సు 33 సంవత్సరాలే.
2010 బ్యాచ్ కర్ణాటక కేడర్‌కు చెందిన అధికారి ఆయన. ప్రొబేషనరీ పీరియడ్ ముగించుకున్న అనంతరం ఉడుపి జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌గా నియమితులు అయ్యారు. చిక్‌మగళూరు జిల్లా ఎస్పీగా, బెంగళూరు దక్షిణ మండలం డీసీపీగా పని చేశారు. ఆ సమయంలో ఆయన ఐపీఎస్ హోదాకు రాజీనామా చేశారు. కర్ణాటక పర్యాటక శాఖ మంత్రి సీటీ రవితో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. తమిళనాడులోని కరూర్ జిల్లాకు చెందిన అన్నామలై ఐఐఎం-లక్నోలో ఉన్నత చదువులను పూర్తి చేశారు. అనంతరం తన తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌కు ఎంపిక అయ్యారు.

ఉడుపి ఎస్పీగా పనిచేస్తోన్న సమయంలో సింగంగా గుర్తింపు పొందారు. ఉడుపి సింగంగా ఆయన గురించి తెలియని వారు జిల్లాల్లో ఎవరూ ఉండకపోవచ్చు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) భావజాలం ఆయనలో అధికంగా కనిపిస్తుంటుంది. ఆ ప్రభావంతోనే ఆయన తన రాజకీయ రంగ ప్రవేశాన్ని బీజేపీతో చేశారని చెబుతున్నారు. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. తమిళనాడులో బీజేపీ ప్రభావం నామమాత్రమేననడంలో సందేహాలు అక్కర్లేదు. ప్రస్తుతం బీజేపీ.. అధికారంలో ఉన్న అన్నా డీఎంకేతో పొత్తు కుదర్చుకుంది.
Recommended Video
గత ఏడాది ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ-ఏఐఏడీఎంకే కలిసి పోటీ చేసినప్పటికీ.. ఆశించిన ఫలితాలు రాలేదు. 39 లోక్‌సభ స్థానాలు ఉన్న తమిళనాడులో ప్రతిపక్ష డీఎంకే క్లీన్ స్వీప్ చేసింది. 38 సీట్లను గెలుచుకోగలిగింది. ఒక్క స్థానంలో మాత్రమే బీజేపీ-ఏఐఏడీఎంకే అభ్యర్థి విజయం సాధించారు. ఈ పరిణామాల మధ్య అన్నామలై.. బీజేపీలో చేరడం కొద్దో, గొప్పో మేలు కలుగుతుందని అంటున్నారు. సర్వీస్‌లో ఫైర్ బ్రాండ్‌గా ముద్రపడిన ఆయన.. అదే తరహా వైఖరి పార్టీని జనంలోకి తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుందని బీజేపీ నేతలు ఆశిస్తున్నారు.












Click it and Unblock the Notifications