జేఎంఎంకు మాజీ సీఎం చంపై సోరెన్ గుడ్‌బై: బీజేపీలోకే
రాంచీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ (Champai Soren) జార్ఖండ్ ముక్తి మోర్చా(JMM)కు రాజీనామా చేశారు. ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీలో అన్ని పదవులకు రాజీనామా చేసినట్లు లేఖ విడుదల చేశారు. ఆదివాసులు, దళితులు, వెనుకబడిన వర్గాలు, సామాన్య ప్రజల కోసం తన పోరాటం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.
తాను బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు చంపై సోరెన్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. రెండు రోజుల్లో తాను బీజేపీలో చేరనున్నట్లు ఆయన తాజాగా తెలిపారు. కాగా, జేఎంఎం నేత హేమంత్ సోరెన్ జైలు నుంచి విడుదలైన తర్వాత జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి చంపై సోరెన్ వైదొలగడంతో.. హేమంత్ సోరెన్ మళ్లీ సీఎంగా పగ్గాలు చేపట్టారు.

ఈ క్రమంలోనే సొంత పార్టీ అధిష్టానంపై చంపై సోరెన్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను పార్టీలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని, ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవాల్సిన సమయం వచ్చిందని చంపై సోరెన్ తెలిపారు.అయితే ఆయన సొంత పార్టీ పెడతారనే ఊహాగానాలు కూడా వచ్చాయి.
కానీ, ఈ నేపథ్యంలోనే చంపై బీజేపీ అగ్రనాయకులతో భేటీ అయ్యారు. దీంతో ఆయన బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. తాజాగా, చంపై సోరెన్ స్వయంగా తాను భారతీయ జనతా పార్టీలో చేరనున్నట్లు ప్రకటించడం గమనార్హం. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న జార్ఖండ్ రాజకీయాల్లో ఈ పరిణామం కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది. చంపై సోరెన్ చేరిక బీజేపీకి కొంత కలిసి వచ్చే అంశంగా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications