ఖర్గే చాణక్యం: కాంగ్రెస్ కండువా కప్పుకొన్న బీజేపీ మాజీ సీఎం- కమలానికి బిగ్ లాస్
బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికల వేళ.. కర్ణాటక రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఊహించినట్టే- భారతీయ జనతా పార్టీకి గుడ్‌బై చెప్పిన మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టార్.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొద్దిసేపటి కిందటే బెంగళూరులోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ఆయన ఆ పార్టీ కండువాను కప్పుకొన్నారు.
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున ఖర్గే- పార్టీ కండువా కప్పి జగదీష్ షెట్టార్‌కు సాదర స్వాగతం పలికారు. ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పీసీసీ అధినేత డీకే శివకుమార్, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య.. ఇతర సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీలో చేరడానికి జగదీష్ షెట్టార్.. ఎలాంటి షరతులు పెట్టలేదని డీకే శివకుమార్ తెలిపారు. బేషరతుగా పార్టీలో చేరారని చెప్పారు.

ఈ పరిణామం- కర్ణాటక బీజేపీకి మింగుడు పడనిదే. వరుసగా రెండోసారి అధికారంలోకి రావడానికి పావులు కదుపుతున్న ఈ దశలో షెట్టార్.. పార్టీని వీడటం బిగ్ షాక్. మే 10వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి జగదీష్ షెట్టార్‌కు టికెట్‌ను నిరాకరించింది బీజేపీ అధిష్ఠానం. ఆయన ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న హుబ్లీ-ధార్వాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం టికెట్‌ను మరొకరికి కేటాయించాలని నిర్ణయించింది.
దీనితో తీవ్ర అసంతృప్తికి లోనైన జగదీష్ షెట్టార్.. కేంద్రమంత్రులు ప్రహ్లాద్ జోషి, ధర్మేంద్ర ప్రధాన్‌తో భేటీ అయ్యారు. వారి నుంచి ఎలాంటి హామీ లభించకపోవడంతో రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. తన శాసన సభ సభ్యత్వానికి ఆదివారమే రాజీనామా చేశారు. సిర్సిలో- అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే కగేరిని కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు.
సిర్సి నుంచి ఆదివారం రాత్రి బెంగళూరుకు చేరుకున్న జగదీష్ షెట్టార్‌తో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రణ్‌దీప్ సుర్జేవాలా, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య భేటీ అయ్యారు. సుదీర్ఘకాలం పాటు వారి మధ్య మంతనాలు కొనసాగాయి. అవి ఫలించాయి. ఈ ఉదయమే షెట్టార్.. పీసీసీ కార్యాలయానికి చేరుకున్నారు. మల్లికార్జున ఖర్గే చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొన్నారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం తొమ్మిది స్థానాలను ఖాళీగా ఉంచింది కాంగ్రెస్. ఆయా స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. జగదీష్ షెట్టార్ చేరికతో ఈ తొమ్మిది స్థానాల్లో ఒకటిని ఆయనకు కేటాయించడం ఖాయంగా కనిపిస్తోంది. నాలుగో విడత కింద ఈ జాబితాను విడుదల చేయనుంది. టికెట్ లభించకపోతే- శాసన మండలికి పంపించే అవకాశాలు లేకపోలేదు.












Click it and Unblock the Notifications