కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారు.. సొంత పార్టీ నేతలపై మాజీ సీఎం బిగ్ బాంబ్!
మణిపూర్ మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత ఎన్.బీరేన్ సింగ్ సొంత పార్టీ నేతలపై సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికలకు ముందే బీజేపీ ప్రభుత్వం ప్రజల్లో కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి పునరుద్ధరించుకోవాల్సి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపిన కొందరు సొంత పార్టీ నేతలే తనను ముఖ్యమంత్రి పీఠం నుంచి దించేందుకు కుట్ర పన్నారని ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
కాంగ్రెస్ నాయకులతో కలిసి కుట్ర!
మాజీ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ మాట్లాడుతూ.. "నేను కేంద్ర నాయకత్వాన్ని ఏమాత్రం తప్పుపట్టడం లేదు. కానీ రాష్ట్రంలోని కొందరు నేతలు కాంగ్రెస్‌తో కుమ్మక్కై నాపై కుట్రలు పన్ని పీఠం నుంచి దించారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన నేను వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రి కావడం కొందరు నాయకులు తట్టుకోలేకపోయారు. బీజేపీని తమ సొంత ఆస్తిగా భావించే వారే ఈ కుట్రకు పాల్పడ్డారు" అని బీరేన్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.

పార్టీలో అసమ్మతి పెరగడం, కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానానికి సిద్ధపడటంతో 2025 ఫిబ్రవరి 9న బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత వై.ఖేమ్‌చంద్ సింగ్ మణిపూర్ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. రాజీనామా అనంతరం బీరేన్ సింగ్ పార్టీలోని అంతర్గత విభేదాలపై బహిరంగంగా మాట్లాడటం ఇదే తొలిసారి.
అప్పుడు నిందలు వేశారు.. మరి ఇప్పుడు హింస ఎందుకు ఆగలేదు?
మణిపూర్‌లో జాతుల మధ్య ఘర్షణలకు తననే బాధ్యుడిని చేస్తూ ప్రచారం చేశారని, అయితే తాను పీఠం నుంచి తప్పుకున్న తర్వాత కూడా హింస ఎందుకు ఆగలేదని ఆయన ప్రశ్నించారు. "గతంలో నేను మెజారిటీ వర్గానికే మద్దతు ఇస్తున్నారని ఆరోపణలు చేశారు. మరి ఇప్పుడు కూడా ఘర్షణలు కొనసాగుతున్నాయి. నాగాల మధ్య, కుకీల మధ్య హింస జరుగుతోంది. మణిపూర్ హింసపై గతంలో మాట్లాడిన యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంది?" అని ఆయన నిలదీశారు.
మత్తుపదార్థాల నియంత్రణ, నకిలీ చొరబాటుదారుల బయోమెట్రిక్ నమోదు కార్యక్రమాలు మళ్లీ ముమ్మరంగా సాగాలని ఆయన సూచించారు. ప్రజలు తననే మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని, అయితే మెజారిటీ అభిప్రాయం ఆధారంగానే ఏ నిర్ణయమైనా ఉంటుందని బీరేన్ సింగ్ స్పష్టం చేశారు. పార్టీలోని అంతర్గత కుమ్ములాటల వల్ల మణిపూర్ అభివృద్ధి అరకొరగానే మిగిలిపోయిందని బీరేన్ సింగ్ విచారం వ్యక్తం చేశారు.














Click it and Unblock the Notifications
