మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ మిస్సింగ్!!
గత నెలలో ఉపరాష్ట్రపతి పదవికి హఠాత్తుగా రాజీనామా చేసిన జగదీప్ ధన్‌ఖర్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారనే దానిపై అనేక ఊహాగానాలు, రాజకీయ చర్చలు జరుగుతున్నాయి. రాజీనామా తర్వాత ఆయన ప్రజల ముందుకు రాకపోవడంతో ఆయన ఆరోగ్యం, నివాసం గురించి ప్రతిపక్ష నేతలు పలు ప్రశ్నలు లేవనెత్తారు. అయితే ప్రస్తుత సమాచారం ప్రకారం.. ఆయన ఇప్పటికీ ఉపరాష్ట్రపతి నివాసం వైస్ ప్రెసిడెంట్ ఎన్‌క్లేవ్‌లోనే ఉంటున్నారు.
జగదీప్ ధన్‌ఖర్ రాజీనామా.. నివాసం, భవిష్యత్తు ప్రణాళికలు
జగదీప్ ధన్‌ఖర్ జులై 21న ఆరోగ్య కారణాలను పేర్కొంటూ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. కానీ అంతర్గత వర్గాల ప్రకారం.. దీనికి వేరే కారణాలు ఉన్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' నివేదిక ప్రకారం, ఆయన రాజీనామా చేసిన తర్వాత కూడా ఉపరాష్ట్రపతి నివాసంలోనే ఉంటున్నారు. రాజ్యసభ సెక్రటేరియట్ ఆయనకు మాజీ ఉపరాష్ట్రపతి హోదాలో ప్రైవేట్ సెక్రటరీని కూడా నియమించింది. ఉపరాష్ట్రపతిగా పదవి విరమణ పొందిన తర్వాత జగదీప్ ధన్‌ఖర్ ఢిల్లీలోని లూటియన్స్ జోన్‌లో ఒక 'టైప్-8' ప్రభుత్వ బంగ్లాకు అర్హులు. ఈ బంగ్లాలు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, సీనియర్ మంత్రులు, ప్రముఖ రాజకీయ నాయకులకు కేటాయిస్తారు. సాధారణంగా ఈ బంగ్లాలు ఎనిమిది వేల నుండి ఎనిమిదిన్నర వేల చదరపు అడుగుల వరకు ఉంటాయి. ఆయన ఈ కొత్త బంగ్లాకు మారడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నప్పటికీ, ఇప్పటికీ ఉపరాష్ట్రపతి నివాసంలోనే కొనసాగుతున్నారు.

రాజకీయ దుమారం.. ప్రతిపక్షాల ప్రశ్నలు
జగదీప్ ధన్‌ఖర్ గైర్హాజరీపై ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేశారు. శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ఈ విషయంలో గళం విప్పారు. సంజయ్ రౌత్ హోంమంత్రి అమిత్ షాకు రాసిన లేఖలో జగదీప్ ధన్‌ఖర్ ఎక్కడ ఉన్నారనే సమాచారం తెలియడం లేదని పేర్కొన్నారు. ఆయన ప్రస్తుత చిరునామా, ఆరోగ్య పరిస్థితి గురించి స్పష్టత లేదని.. ఆయనను సంప్రదించడానికి ప్రయత్నించినా విఫలమయ్యామని సంజయ్ రౌత్ వెల్లడించారు.
మరోవైపు'లాపతా లేడీస్' సినిమా గురించి విన్నానని, కానీ 'లాపతా వైస్ ప్రెసిడెంట్' గురించి ఎప్పుడూ వినలేదని కపిల్ సిబల్ వ్యంగ్యంగా అన్నారు. రాజీనామా తర్వాత జగదీప్ ధన్‌ఖర్ ఆచూకీ తెలియకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారం జగదీప్ ధన్‌ఖర్ ఆరోగ్య పరిస్థితి, ఆయన తదుపరి రాజకీయ అడుగుల గురించి అనేక ప్రశ్నలకు దారితీస్తోంది.












Click it and Unblock the Notifications