బ్యాంక్ అకౌంట్ కు ఇక నలుగురు నామినీలు-త్వరలో కేంద్రం బిల్లు..!
దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో పేరుకుపోతున్న క్లెయిమ్ చేయని డిపాజిట్ల సమస్యకు పరిష్కారం చూపించేలా కేంద్రం బ్యాంకింగ్ చట్టానికి సవరణ చేయబోతోంది. ఈ మేరకు త్వరలో పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టబోతంది. ఇప్పటికే ఈ ఏడాది మార్చి వరకూ దేశంలో రూ.78 వేల కోట్ల క్లెయిమ్ చేయని డిపాజిట్లు బ్యాంకుల్లో మగ్గుతున్నాయి. వీటిని క్లెయిమ్ చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్ధితి. దీనికి ప్రధాన కారణం ఒక నామినీయే ఉండటం.
ఈ నేపథ్యంలో ఇకపై ఒక్కో బ్యాంక్ అకౌంట్ కూ నలుగురు నామినీలను అనుమతిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు బ్యాంకింగ్ చట్టాల్లో సవరణలు చేస్తూ బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. తద్వారా అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లతో పాటు బాండ్లు, డివిడెండ్ల సమస్యకు కూడా పరిష్కారం లభించనుందని ఆశిస్తున్నారు. ప్రస్తుతం బ్యాంకుల్లోని సేవింగ్, ఫిక్సెడ్ డిపాజిట్ ఖాతాలకు సైతం ఒక నామినీని మాత్రమే ఉంచే అవకాశం ఉంది. నలుగురు నామినీలను అనుమతించడం ద్వారా వీరిలో ఎవరో ఒకరు ఖాతాదారుడి మరణం తర్వాత డిపాజిట్ మొత్తాల్ని క్లెయిమ్ చేసుకునే అవకాశం లభించనుంది.

ప్రస్తుతం పీపీఎఫ్ కు మాత్రమే ఒకరి కంటే ఎక్కువ మంది నామినీలను పెట్టుకునే అవకాశం ఉంది. ఇకపై ఇతర బ్యాంకు ఖాతాలకూ నామినీలను పెట్టుకుంటే క్లెయిమ్ చేయని డిపాజిట్ల సమస్యకు చెక్ పడబోతోంది. దీంతో పాటు బ్యాంకింగ్ వ్యవస్థల్లో మరిన్ని మార్పులకు శ్రీకారం చుట్టేలా కేంద్రం సవరణ బిల్లు తీసుకురానుందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇది అమల్లోకి వస్తే చాలా సమస్యలకు చెక్ పడనుంది.












Click it and Unblock the Notifications