మరో 95 విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్-ఫ్లైట్ ఎక్కాలంటే భయపడుతున్న జనం..!
దేశవ్యాప్తంగా విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ పర్వం కొనసాగుతోంది. ఈ మధ్యే దేశంలో పలు ప్రైవేట్ రంగ సంస్థల విమానాలకు నకిలీ బాంబు బెదిరింపు కాల్స్ మొదలయ్యాయి. వీటి సంఖ్య కూడా నానాటికీ పెరుగుతూ పోతోంది. తాజాగా మరో 95 విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు పౌర విమానయాన మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. ఇందులో పలు ప్రైవేట్ ఎయిర్ లైన్స్ సంస్థలు బాధితులుగా ఉన్నట్లు తెలుస్తోంది.
తాజాగా 95 బాంబు బెదిరింపు కాల్స్ అందుకున్న విమాన యాన సంస్థల్లో ఎయిర్ ఇండియా, విస్తారా, ఇండిగో, స్పైస్ జెట్ సంస్థలు ఉన్నాయి. వీటికి సంబంధించిన పలు విమానాలకు తాజాగా బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో వెంటనే అధికారులను అలర్ట్ చేసి తనిఖీలు చేపట్టారు. వీటిలో ఎలాంటి బాంబులూ లేవని తేలడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. రోజురోజుకూ పెరిగిపోతున్న నకిలీ బెదిరింపు కాల్స్ తో విమానాల్లో ప్రయాణించాలంటే భయపడే పరిస్ధితి తలెత్తుతోంది.

మరోవైపు ఈ నకిలీ బాంబు బెదిరింపు కాల్స్ వెనుక వీటికి లభిస్తున్న సోషల్ మీడియా ప్రచారమే కారణంగా కేంద్రం భావిస్తోంది. దీంతో సోషల్ మీడియా దిగ్గజం ఎక్స్ ను ఇలాంటి వార్తలను ప్రచురించవద్దని కోరింది. అలాగే ఫేస్ బుక్ , ఇతర ప్లాట్ ఫామ్స్ లను కూడా కోరుతున్నట్లు తెలుస్తోంది. అలాగే విమానాలకు బెదిరింపు కాల్స్ చేసే వారిని ఐదేళ్ల పాటు విమాన ప్రయాణం చేయకుండా బ్లాక్ లిస్ట్ లో పెడతామని కూడా హెచ్చరికలు జారీ చేస్తోంది. అయినా కాల్స్ మాత్రం ఆగడం లేదు.












Click it and Unblock the Notifications