బీజేపీకి కంగ్రాట్స్ చెప్పిన డీకేశి- చిరునవ్వుతో మంట
Fuel Price Hike: గృహావసరాల వంటగ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వాటి రేట్లను భారీగా పెంచింది. ఒక్కో సిలిండర్‌పై 50 రూపాయలను పెంచుతున్నట్లు పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొత్త రేట్లు మంగళవారం తెల్లవారుజాము నుంచి అమలులోకి వస్తాయి. ఉజ్వల పథకానికి కూడా పెంపుదల వర్తింపజేసింది.
కొద్దిసేపటి కిందటే దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచింది కేంద్ర ప్రభుత్వం. పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై లీటర్ ఒక్కింటికి రెండు రూపాయల మేర పెంచింది. ఈ మేరకు ఆయిల్ కంపెనీలు ఓ ప్రకటన విడుదల చేశాయి. ఈ పెంపు- రిటైల్ అమ్మకాలకు వర్తించదంటూ పెట్రోలియం మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది.

అదే సమయంలో గృహావసరాల ఎల్పీజీ వంటగ్యాస్ వినియోగదారులకు షాక్ తగిలింది. ఒక్కో సిలిండర్ మీద 50 రూపాయలు పెరిగింది. ఉజ్వల పథకం కింద నిరుపేద కుటుంబాలకు అందజేస్తోన్న సిలిండర్లపైనా ఈ తాజా వడ్డింపు వర్తింపజేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ పెంపుదలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఘాటుగా స్పందించారు. దీనికి కారణం లేకపోలేదు. ఇటీవలే కర్ణాటకలో డీజిల్ అమ్మకాలపై ఆయన ప్రభుత్వం రెండు రూపాయల మేర పన్నును పెంచింది. దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమాలకు దిగిందా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ. రోడ్డెక్కి మరీ నిరసనలు చేపట్టింది. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఈ నిరసన ప్రదర్శనలు సాగాయి.
ఇప్పుడు అదే బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రేట్లను రెండు రూపాయల మేర పెంచింది. అది- సిద్ధరామయ్యకు అయాచిత అస్త్రంలా మారింది. దీనితో బీజేపీపై సెటైర్లు సంధించారాయాన. ఇప్పుడు ఎవరు? ఎవరి మీద ఆందోళనలు, ధర్నాలు దిగాలంటూ చురకలు అంటించారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గినప్పటికీ- బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై లీటరు ఒక్కింటికి రెండు రూపాయల మేర ఎక్సైజ్ ట్యాక్స్‌ను పెంచిందని, ఇది దేశ ప్రజలకు బహుమతిగా ఇచ్చిందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు.
కర్ణాటక బీజేపీ రాష్ట్రశాఖ ఇప్పుడు ఈ పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదలకు నిరసనగా ఢిల్లీలో తమ పార్టీ అధిష్ఠానం వద్ద నిరసనలు ప్రదర్శనలు నిర్వహిస్తుందా? లేక- కర్ణాటక ప్రభుత్వాన్ని తప్పుపట్టడానికి మాత్రమే పరిమితమౌతుందా? అంటూ సెటైర్లు వేశారు.
ఇప్పుడు తాజాగా కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా తెర మీదికి వచ్చారు. బీజేపీ రాష్ట్ర శాఖ నాయకులపై ఎదురుదాడికి దిగారు. డీజిల్‌పై మాత్రమే మూడు శాతం మేర అమ్మకపు పన్ను పెంచితే బీజేపీ నాయకులు ఆందోళనలు, ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేపట్టారని, ఇప్పుడు కేంద్రం చేసిన పనికి ఆందోళనలు చేస్తారా? అంటూ నిలదీశారు.
I congratulate my BJP friends who are doing the Janakrosha Yatre against the Union BJP Govt.
— DK Shivakumar (@DKShivakumar) April 8, 2025
May you continue to fight against #PriceHike! pic.twitter.com/LWOfdepVpN
డీజిల్ ధరల పెంపుదలకు నిరసనగా జన్ ఆక్రోశ్ యాత్ర చేస్తోన్నందుకు బీజేపీ నాయకులందరినీ అభినందిస్తోన్నానని డీకే శివకుమార్ చెప్పారు. అదే సమయంలో- కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గృహావసర వంట గ్యాస్ ధరలను పెంచిందని గుర్తు చేశారు.
అందుకే ఈ జన్ ఆక్రోశ్ యాత్రను బీజేపీ ఇంకా కొనసాగించాలని, తీవ్రంగా పోరాడాలని కోరుకుంటోన్నానని డీకే శివకుమార్ అన్నారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ రేట్లు పెంచింది సొంత పార్టీనేనని, అందుకే అభినందిస్తోన్నానని చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించేంత వరకు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నాయకులు జన్ ఆక్రోశ్ యాత్రను కొనసాగించాలని అన్నారు.












Click it and Unblock the Notifications