చమురు షాక్: వాహనదారులకు బిగ్ అలర్ట్!
ఇండియాలో కేంద్రం చమరు ధరలను పెంచేసిన సంగతి తెలిసింది. అయితే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని.. ఈ ప్రభావం రాబోయే3 నుంచి 4 నెలల వరకు కొనసాగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు నిరంతరం పెరుగుతుండటమే ఇందుకు ప్రధాన కారణం. శుక్రవారం దేశంలో లీటర్ పెట్రోల్ రూ.3, డీజిల్ రూ.2 పెంచినప్పటికీ.. ఈ ధరల పెంపు ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదని మార్కెట్ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
ప్రస్తుతం పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ చమురు సరఫరాలో ఏర్పడుతున్న అడ్డంకులు ప్రపంచ మార్కెట్‌ను కలవరపెడుతున్నాయి. దీనివల్ల బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర రికార్డు స్థాయిలో బ్యారెల్‌కు 110 డాలర్ల మార్కుకు చేరువైంది. భారతదేశంలో దాదాపు నాలుగేళ్ల తర్వాత మే 15న ఇంధన ధరలను పెంచారు. ముడి చమురు ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో ప్రభుత్వ రంగ చమురు పంపిణీ సంస్థలపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతోంది. అయితే ప్రస్తుతం చేసిన 3 రూపాయల పెంపు చమురు కంపెనీల నష్టాలను పాక్షికంగా మాత్రమే భర్తీ చేయగలదని నిపుణులు అంటున్నారు.

భవిష్యత్తులో ఈ ధరలు ఎంతవరకు పెరగవచ్చనే దానిపై ఇంధన విశ్లేషకులు స్పష్టతనిచ్చారు. ముడి చమురు ధరలు దీర్ఘకాలం పాటు బ్యారెల్‌కు 90-100 డాలర్ల కంటే ఎక్కువగానే కొనసాగితే, రాబోయే రోజుల్లో ఇంధన ధరలు మరింత ప్రియం కాక తప్పదు. చమురు కంపెనీల లెక్కల ప్రకారం.. లీటర్ ఇంధనంపై 1 రూపాయి పెంచితే ప్రభుత్వ రంగ చమురు సంస్థల వార్షిక ఆదాయం సుమారు 15,000 నుండి 16,000 కోట్ల రూపాయల వరకు మెరుగుపడుతుంది. ఆ లెక్కన చూస్తే, తాజా పెంపు ద్వారా కంపెనీలకు 45,000 నుండి 48,000 కోట్ల రూపాయల వరకు ఊరట లభిస్తుంది. కానీ, అంతర్జాతీయ పరిస్థితులు ఇలాగే ఉంటే చమురు కంపెనీల పూర్తి నష్టాల భర్తీకి మొత్తంగా లీటర్‌పై 10 రూపాయల వరకు పెంచాల్సిన అవసరం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
భారతదేశం తన ముడి చమురు అవసరాలలో దాదాపు 85 శాతం ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా జరిగే రాజకీయ పరిణామాలు, యుద్ధ వాతావరణం దేశీయ ఇంధన ధరలపై నేరుగా ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి ( ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలు సరఫరాకు పెద్ద గండంగా మారాయి. రిటైల్ ధరలను మరింత పెంచకపోతే చమురు కంపెనీల లాభాలు పూర్తిగా పడిపోతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు ఇంధన ధరల నిరంతర పెంపు దేశంలో ద్రవ్యోల్బణం పెరగడానికి దారితీస్తుందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రవాణా, లాజిస్టిక్స్ ఖర్చులు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి, సామాన్యుడి గృహ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే భవిష్యత్తులో సామాన్యులపై ఈ భారం పడకుండా చూడటంలో ప్రభుత్వ జోక్యం, పన్నుల తగ్గింపు వంటి నిర్ణయాలు అత్యంత కీలకం కానున్నాయి.












Click it and Unblock the Notifications