మోదీ- జో బైడెన్: ముఖాముఖి భేటీ: హెచ్1 బీ విసాపై కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల్లో అత్యున్నత భేటీల్లో ఒకటిగా భావించే జీ20 సమ్మిట్‌కు సర్వం సిద్ధమైంది. శని, ఆదివారాల్లో ఈ సమ్మిట్ జరుగబోతోంది. దీని కోసం ఢిల్లీ ముస్తాబైంది. ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో ఈ శిఖరాగ్ర సదస్సు ఏర్పాటైంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలోని ప్రఖ్యాత కట్టడాలన్నింటినీ మువ్వన్నెల వెలుగులతో అలంకరించారు.
జీ20లో భారత్ సహా అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, బ్రిటన్, అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు ఇందులో సభ్యులుగా కొనసాగుతున్నాయి.

ఈ సమావేశంలో పాల్గొనడానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. భారత్‌కు చేరుకున్నారు. ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. అమెరికా అధ్యక్షుడి అధికారిక విమానం ఎయిర్ ఫోర్స్ వన్.. కొద్దిసేపటి కిందటే ఢిల్లీలో దిగింది. ఈ నెల 10వ తేదీ వరకూ ఆయన భారత్‌లోనే ఉంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశాలతో పాటు జీ20 సమ్మిట్‌లో పాల్గొంటారు.

తన పర్యటనలో భాగంగా జో బైడెన్.. కొద్దిసేపటి కిందటే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశం అయ్యారు. నంబర్ 7, లోక్ కల్యాణ్ మార్గ్‌కు చేరుకున్న బైడెన్‌కు మోదీ ఘన స్వాగతం పలికారు. ఆయన కారుకు ఎదురెళ్లి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చాయి. పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు.

జీఈ జెట్ ఇంజిన్లు, న్యూక్లియర్ టెక్నాలజీని ఇచ్చిపుచ్చుకోవడానికి ఉద్దేశించిన ఒప్పందాలపై ఇరు దేశాల అధికారులు సంతకాలు చేశారు. భారత పౌరులకు మరిన్ని హెచ్1 బీ విసాలను మంజూరు చేయడానికీ జో బైడెన్ అంగీకరించారు. దీనిపై తక్షణ చర్యలను తీసుకుంటామని హామీ ఇచ్చారు.
హెచ్1 బీ విసా కోటాల పెంపునకు సంబంధించిన ఉత్తర్వులను త్వరలోనే జారీ చేస్తామని జో బైడెన్ హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. తన భారత పర్యటనలో భాగంగా బైడెన్.. శనివారం ఉదయం రాజ్‌ఘాట్‌ను సందర్శిస్తారు. జాతిపిత మహాత్మా గాంధీ సమాధికి నివాళి అర్పిస్తారు. అనంతరం ప్రగతి మైదాన్‌కు బయలుదేరి వెళ్తారు.












Click it and Unblock the Notifications