
పవన్ కల్యాణ్ సినిమా టైటిల్ తోః ఆ గదుల జోలికి వెళ్తేః మోడీ సర్కార్ పై రాహుల్ నిప్పులు
న్యూఢిల్లీః దేశవ్యాప్తంగా ఇవ్వాళ్టి నుంచి కొత్త జీఎస్టీ సవరణలు అమలులోకి వచ్చాయి. పలు రకాల నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. బ్యాంకింగ్ సేవలు మరింత ప్రియం అయ్యాయి. ఆసుపత్రుల సేవలపై పెనుభారం మోపింది కేంద్ర ప్రభుత్వం. హోటల్ గదుల పరిస్థితీ ఇంతే. ఆసుపత్రులు, హోటల్ గదుల వినియోగాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు వీటిపై జీఎస్టీ ఉండేది కాదు.

లేని జీఎస్టీ కొత్తగా..
ఇప్పటివరకు జీఎస్టీ పరిధిలోకి లేని పలు రకాల నిత్యావసర సరుకులపై తాజాగా విపరీతమైన భారం పడింది. పెరుగు, లస్సీ, మజ్జిగ, పన్నీరు వంటివి ముట్టుకుంటే చేతులు కాలేలా తయారయ్యాయి. మనం రోజూ వినియోగించే బియ్యం, గోధుమలు, రాగి, బార్లీ, ఓట్స్ వంటి ఆహార ధాన్యాలు కూడా జీఎస్టీ పరిధిలోకి వచ్చాయి. పెరుగు, లస్సి, మజ్జిగ, పన్నీర్, బియ్యం, గోధుమలు, రాగులు, బార్లీ, ఓట్స్ పై అయిదు శాతం మేర జీఎస్టీని విధించింది కేంద్ర ప్రభుత్వం.
ఆ గదుల జోలికి వెళ్తే..
5,000 రూపాయలకు పైగా అద్దెను వసూలు చేస్తోన్న ఆసుపత్రుల గదులను కూడా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చింది. వాటిపై అయిదు శాతం మేర జీఎస్టీని విధించింది. 1,000 రూపాయలకు పైగా అద్దెను వసూలు చేసే హోటల్ గదులపై ఏకంగా 12 శాతం మేర జీఎస్టీని అమలు చేసింది. ఇప్పటివరకు వీటిల్లో ఏ ఒక్కదాని మీద కూడా జీఎస్టీ వసూలు అయ్యేది కాదు.
బ్యాంకు చెక్కులపై
అలాగే- బ్యాంకుల్లో నుంచి కొత్తగా చెక్కులను తీసుకోవడం కూడా ఇవ్వాళ్టి నుంచి పెనుభారంగా పరిణమించింది. ఖాతాదారులకు బ్యాంకులు జారీ చేసే చెక్కులపై 18 శాతం మేర జీఎస్టీని ముక్కు పిండి మరీ వసూలు చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటివరకు ఇది జీఎస్టీ పరిధిలో లేదు. సోలార్ వాటర్ హీటర్స్ పై ఇదివరకే వసూలు చేస్తోన్న జీఎస్టీ శ్లాబ్ ను సవరించింది. అయిదు శాతంగా ఉన్న దీని శ్లాబ్ ను 12 శాతానికి పెంచింది.
గబ్బర్ సింగ్ మళ్లీ వచ్చాడు..
దీనితోపాటు- ఎల్ఈడీ బల్బులు, లైట్లపై నిన్నటివరకు కేంద్ర ప్రభుత్వం 12 శాతం మేర జీఎస్టీని వసూలు చేస్తుండేది. ఇవ్వాళ్టి నుంచి అది 18 శాతానికి చేరింది. ఈ పరిణామాలపై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, లోక్ సభ సభ్యుడు రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు. గబ్బర్ సింగ్ మళ్లీ వచ్చాడంటూ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం గబ్బర్ సింగ్ తరహాలో దోపిడీకి పాల్పడుతోందంటూ ధ్వజమెత్తారు.

మాస్టర్ క్లాస్..
ఎక్కడా లేని విధంగా దేశ ప్రజలపై అత్యధిక పన్నులను కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తోందని విమర్శించారు. అదే సమయంలో కొత్త ఉద్యోగాలను కల్పించడంలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఆర్థిక పురోగమనాన్ని నమోదు చేసిన ఓ దేశాన్ని ఎంతగా ధ్వంసం చేయాలనుకుందో బీజేపీ అంతగా ధ్వంసం చేసిందని నిప్పులు చెరిగారు. బీజేపీ మాస్టర్ క్లాస్ ప్రదర్శనగా అభివర్ణించారు.