రాహుల్‌కు పెళ్లి చేద్దామా?: మహిళా రైతుతో సోనియా గాంధీ ఏమన్నారంటే?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో అగ్రనేతగా కొనసాగుతున్న రాహుల్ గాంధీ పెళ్లి విషయం దేశంలో ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటోంది. చాలా సందర్భాల్లో, రాజకీయ వేదికలపైనా రాహుల్ వివాహం గురించిన చర్చలు వస్తూనే ఉంటుంది. తాజాగా, మరోసారి రాహుల్ పెళ్లి విషయం తెరపైకి వచ్చింది. ఇటీవల సోనియా గాంధీ కుటుంబాన్ని కలిసేందుకు హర్యానా మహిళా రైతులు వారి నివాసానికి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోనియా గాంధీతో మాట్లాడుతూ రాహుల్ వివాహం గురించి అడిగారు.
కాగా, జులై నెల ప్రారంభంలో రాహుల్ గాంధీ హర్యానాలో పర్యటించిన సమయంలో.. సోనీపత్ జిల్లా మదీనా గ్రామ మహిళా రైతులు ఢిల్లీకి, అక్కడి రాహుల్ నివాసానికి రావాలని ఉందని చెప్పారు. దీంతో ఆయన తనకు ఇప్పుడు ఇళ్లు లేదని, దీంతో తానే తన తల్లి సోనియా గాంధీ వద్ద ఉంటున్నట్లు చెప్పారు. అక్కడికే రావాలని వారిని రాహుల్ ఆహ్వానించారు. ఈ క్రమంలో ఇటీవల ఆ మహిళలంతా ఢిల్లీలోని సోనియా ఇంటికి వెళ్లారు. ఇందుకు సంబంధించిన పూర్తి వీడియోను రాహుల్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

హర్యానా నుంచి వచ్చిన ఆ మహిళలు ముందుగా ఢిల్లీలోని పలు ప్రాంతాలను సందర్శించారు. అనంతరం 10 జన్‌పథ్‌లోని సోనియా నివాసానికి చేరుకున్నారు. వీరిని గాంధీ కుటుంబం సాదరంగా ఆహ్వానించింది. వారికి ప్రత్యేక ఆతిథ్యం ఏర్పాటు చేశారు. సోనియా, ప్రియాంక, రాహుల్ కూడా ఆ మహిళలతో కలిసి భోజనం చేశారు. వారితో అప్యాయంగా ముచ్చటించారు.
ఈ సందర్భంగా ఓ మహిళ సోనియా గాంధీ చెవిలో.. 'రాహుల్‌కు పెళ్లి చేద్దామా' అని అడిగారు. దీనికి సోనియా బదులిస్తూ.. 'మీరే ఓ మంచి అమ్మాయిని చూడండి' అని అన్నారు. దీంతో రాహుల్ నవ్వుతూ 'అవుతుంది.. అవుతుంది' అంటూ వ్యాఖ్యానించారు.
मां, प्रियंका और मेरे लिए एक यादगार दिन, कुछ खास मेहमानों के साथ!
— Rahul Gandhi (@RahulGandhi) July 29, 2023
सोनीपत की किसान बहनों का दिल्ली दर्शन, उनके साथ घर पर खाना, और खूब सारी मज़ेदार बातें।
साथ मिले अनमोल तोहफे - देसी घी, मीठी लस्सी, घर का अचार और ढेर सारा प्यार।
पूरा वीडियो यूट्यूब पर:https://t.co/2rATB9CQoz pic.twitter.com/8ptZuUSDBk
ఇది ఇలావుండగా, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మరణం గురించి ఆ మహిళలు సోనియాను అడగడంతో ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఆ సమయంలో అమ్మ చాలా కుంగుబాటుకు లోనయ్యారని, కొన్ని రోజులపాటు అన్నం, నీళ్లు ముట్టలేదని ప్రియాంక చెబుతుండగా సోనియా కన్నీటిపర్యంతమయ్యారు. దీంతో అక్కడ ఒక్కసారిగా భావోద్వేగ వాతావరణం ఏర్పడింది.
అయితే, కాసేపటికే తేరుకున్న సోనియా.. మహిళలతో సరదాగా ముచ్చటించారు. ఆ తర్వాత మహిళా రైతులతో కలిసి సోనియా, ప్రియాంక నృత్యం కూడా చేశారు. కాగా, ఇటీవల ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కూడా రాహుల్ పెళ్లి విషయాన్ని తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications