ఒకే తండ్రి.. ముగ్గురు భార్యలు.. ముగ్గురు కూతుళ్ల బలవన్మరణం!
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ముగ్గురు మైనర్ సోదరీమణుల ఆత్మహత్య ఉదంతం దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. కొరియన్ డ్రామాలు, సంగీతం(K-Pop) పట్ల ఉన్న విపరీతమైన వ్యామోహం ఈ చిన్నారుల ప్రాణాలు తీయడానికి ఒక ప్రధాన కారణమని పోలీసుల విచారణలో తేలింది. మరోవైపు తండ్రి తమ ఫోన్లను లాక్కున్నాడన్న కోపంతోనే వారు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు ప్రాథమిక ఆధారాలు చెబుతున్నాయి.
అసలు ఏం జరిగిందంటే?
నిషిక (16), ప్రాచి (14), పాఖి (12) అనే ముగ్గురు సోదరీమణులు కొరియన్ వినోద కార్యక్రమాలకువిపరీతమైన అభిమానులు. వీరు నిరంతరం మొబైల్ ఫోన్లలో కొరియన్ డ్రామాలు చూడటం, ఆన్‌లైన్ గేమింగ్ ఆడటంతో తండ్రి చేతన్ కుమార్ కలత చెందాడు. దీనికి తోడు స్టాక్ బ్రోకర్‌గా పనిచేస్తున్న చేతన్ కుమార్ దాదాపు రూ. 2 కోట్ల అప్పుల్లో ఉన్నాడు. విద్యుత్ బిల్లులు చెల్లించడానికి డబ్బు లేకపోవడంతో, చిన్నారులు మొబైల్ వాడకాన్ని తగ్గించాలని హెచ్చరించి వారి ఫోన్లను అమ్మేశాడు.

ఆ రాత్రి ఏం జరిగింది?
దర్యాప్తు ప్రకారం.. ఘటన జరిగిన రాత్రి ఈ ముగ్గురు బాలికలు తమ తల్లి మొబైల్ ఫోన్‌ను తీసుకున్నారు. అయితే వారు చూడాలనుకున్న కొరియన్ యాప్స్ లేదా కంటెంట్ ఆ ఫోన్‌లో అందుబాటులో లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తమ కొరియన్ స్నేహితులతో మాట్లాడలేకపోవడం, గేమింగ్ యాప్స్ పని చేయకపోవడంతో వారు తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యారు. చివరకు తమ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
వింతైన కుటుంబ నేపథ్యం
పోలీసుల విచారణలో మరో ఆసక్తికరమైన విషయం బయటపడింది. నిందితుడు చేతన్ కుమార్‌కు ముగ్గురు భార్యలు - సుజాత, హీన, టీనా. విచిత్రమేమిటంటే, ఈ ముగ్గురు భార్యలు సొంత అక్కాచెల్లెళ్లు. ఆత్మహత్య చేసుకున్న బాలికల్లో నిషిక సుజాత కుమార్తె కాగా, ప్రాచి, పాఖి హీనా కుమార్తెలు. ఈ ముగ్గురు బాలికలు తమ తండ్రికి చాలా దగ్గరగా ఉండేవారని, అందుకే సూసైడ్ నోట్‌లో ఎక్కడా తమ తల్లి పేరు ప్రస్తావించకుండా తండ్రినే ఉద్దేశించి రాశారని పోలీసులు భావిస్తున్నారు.
తొమ్మిది పేజీల డైరీలో సంచలన విషయాలు
బాలికల గది నుంచి పోలీసులు తొమ్మిది పేజీల డైరీని స్వాధీనం చేసుకున్నారు. అందులో వారు కొరియన్ సంస్కృతి పట్ల తమకున్న అమితమైన ఇష్టాన్ని, కుటుంబంలో ఉన్న కలహాలను వివరించినట్లు సమాచారం. ఫోన్ల డేటా కోసం సైబర్ క్రైమ్ టీమ్ రంగంలోకి దిగింది. అమ్మేసిన ఫోన్లను గుర్తించి, వాటి నుంచి సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications