విజయవాడ, ఖమ్మం, మధిర, వరంగల్ ప్రజలకు శుభవార్త
కాజీపేట-డోర్నకల్-విజయవాడ మధ్య నడుస్తున్న ఫుష్ ఫుల్ రైలు పట్టాలెక్కింది. విజయవాడ డివిజన్ పరిధిలోని వివిధ చోట్ల ట్రాక్ మరమ్మతు పనులు జరుగుతుండటంతో భారతీయ రైల్వే ఐదు నెలల క్రితం దీన్ని రద్దుచేసింది. తర్వాత దశలవారీగా ఈ రద్దును పొడిగించుకుంటూ వచ్చింది. ఈ రైలు లేక ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొనేవారు.
ప్రజల తీవ్ర ఇక్కట్లు : డోర్నకల్ జంక్షన్ రైల్వేస్టేషన్ ను సందర్శించి సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ తోపాటు ఇతర ఉన్నతాధికారులకు ఇక్కడి ప్రజలు వినతి పత్రాన్ని అందజేశారు. తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నామని తెలిపారు. మీడియాలో కూడా ఈ రైలు వల్ల ఇబ్బందులు పడుతున్నారంటూ కథనాలు వచ్చాయి. గార్లలో ప్రజలు ప్రత్యక్షంగా నిరసన తెలిపారు. దాదాపు 5 నెలల విరామం తర్వాత ఈ రైలు పట్టాలెక్కింది. ప్రతి రోజు ఉదయం 6.40 గంటలకు కాజీపేట నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.10 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.

రైలెక్కే అవకాశం ఏది : కరోనా వచ్చిన తర్వాత భారతీయ రైల్వేలో వివిధ మార్పులు చోటుచేసుకున్నాయి. దేశవ్యాప్తంగా తిరుగుతున్న ప్యాసింజర్ రైళ్లను ఎక్స్ ప్రెస్ రైళ్లుగా మార్చారు. దీనివల్ల చిన్న చిన్న స్టేషన్లలోని ప్రజలు రైలెక్కే అవకాశాన్ని కోల్పోయారు. అంతేకాకుండా ప్రయాణాల పరంగా తీవ్ర ఇక్కట్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. సమీపంలోని పెద్ద స్టేషన్ కు చుట్టుపక్కల స్టేషన్ల ప్రజలు రావాల్సి వస్తోంది. ఇది అనేక వ్యయప్రయాసలతో కూడుకొని ఉంది. ఈ క్రమంలోనే కొన్ని ప్యాసింజర్ రైళ్లపై ఆధారపడ్డ ప్రజలు గమ్యస్థానాలకు చేరుకోవడంలో కూడా ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొనే కాజేపేట-విజయవాడ ఫుష్ ఫుల్ ను తిరిగి ప్రారంభించారు.












Click it and Unblock the Notifications