Indian visa: ఇక క్షణాల్లో వీసా అప్లికేషన్ ప్రాసెస్! రూల్స్ ఛేంజ్
భారతదేశాన్ని చుట్టేయాలనుకునే విదేశీ ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. నిబంధనల పేరుతో ఉన్న అనేక చిక్కుముడులను విప్పేస్తూ, వీసా ప్రక్రియను అత్యంత సులభతరం చేసింది. ఇప్పటివరకు ఉన్న వీసా విభాగాల్లో భారీగా కోతలు విధిస్తూనే, అప్లికేషన్ ఫారమ్‌లను కూడా బాగా కుదించింది. విదేశీయులు భారతదేశానికి రావడం, ఇక్కడ బిజినెస్, విద్యా, వైద్య సేవలు పొందడం ఇకపై మరింత సులభం కానుంది. కేంద్ర హోంశాఖ తీసుకొచ్చిన ఈ సరికొత్త మార్పులు అంతర్జాతీయ ప్రయాణికులకు పెద్ద ఊరటనివ్వనున్నాయి.
కేటగిరీల కుదింపు.. అప్లికేషన్ ప్రక్రియ వేగవంతం
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మన దేశ వీసా విధానాన్ని మార్చేందుకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. గతంలో ఉన్న 13 ప్రధాన వీసా విభాగాలను 9 కి, అలాగే 49 సబ్ కేటగిరీలను 23 కి తగ్గించింది. దీనికి తోడు వీసా దరఖాస్తులో ఉండే నింపాల్సిన సమాచారాన్ని (ఫీల్డ్స్) ఏకంగా 65 నుంచి 70 శాతం వరకు తొలగించింది. దీనివల్ల ఫారమ్ నింపే టైం సేవ్ అవ్వడమే కాకుండా, దరఖాస్తులను పరిశీలించడం అధికారులకు కూడా వేగవంతం కానుంది.

'టూరిస్ట్' స్థానంలో 'విజిటర్' వీసా.. రెండు కొత్త రకాలు
సాధారణంగా ఇచ్చే టూరిస్ట్ వీసా పేరును ఇకపై 'విజిటర్ వీసా'గా మార్చారు. ప్రయాణ కాలపరిమితి, అవసరాన్ని బట్టి దీనిని V-1, V-2 అని రెండు రకాలుగా విభజించారు.
- V-1 వీసా: ఏడాది లోపు పరిమితి కలిగిన బిజినెస్ మీటింగ్స్, మెడికల్, సంగీతం, కళలు, భారతీయ భాషల కోర్సుల కోసం వచ్చే వారికి 30 రోజుల గడువుతో మల్టిపుల్ ఎంట్రీ వీసా ఇస్తారు.
- V-2 వీసా: ఏడాది నుంచి ఐదేళ్లు లేదా పదేళ్ల వరకు సుదీర్ఘ కాలపరిమితితో ఉండే ఈ వీసాను ట్రెక్కింగ్, లాంగ్ జర్నీల కోసం కేటాయిస్తారు.
మెడికల్ చెక్ అప్ కు పెద్దపీట.. ఆయుష్‌కూ ప్రత్యేక వీసా
భారత్‌లో వైద్యం చేయించుకోవాలనుకునే విదేశీయులకు సరికొత్త సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. సాధారణ వైద్యం కోసం M-1 వీసా ఇస్తుండగా, ఆయుర్వేద, యోగా, సిద్ధ వంటి సాంప్రదాయ ఆయుష్ (AYUSH) చికిత్సల కోసం M-3 పేరిట ప్రత్యేక వీసాను కేటాయించారు. వీటి ఆధారంగా వచ్చే రోగుల సహాయకులకు M-2, M-4 వీసాలు ఇస్తారు. ఇవి ఏడాది పాటు చెల్లుబాటులో ఉంటాయి. పలుమార్లు భారత్‌కు వచ్చి వెళ్లే వెసులుబాటు ఉండటం వల్ల మెడికల్ వీసాలు బాగా పుంజుకునే అవకాశం ఉంది.
విద్యార్థులు, వ్యాపారవేత్తలకు కొండంత అభయం
చదువుకోవడానికి వచ్చే విదేశీ విద్యార్థుల కోసం S-1, రీసెర్చ్, పీహెచ్‌డీ విద్యార్థుల కోసం S-2 కేటగిరీలను తెచ్చారు. 'స్టడీ ఇన్ ఇండియా' పోర్టల్ ద్వారా వచ్చే విద్యార్థులకు ఐదేళ్ల వరకు వీసా లభిస్తుంది. అలాగే వ్యాపారవేత్తల కోసం B-1 (లాంగ్ టర్మ్ బిజినెస్, పరిశ్రమల స్థాపన), B-2 (స్వల్పకాలిక ఒప్పందాలు, కాన్ఫరెన్స్‌లు, నిపుణుల సాంకేతిక సేవలు) వీసాలను కేటాయించారు. విదేశీ నిపుణులు, ఇంజనీర్లు భారత్‌లో ప్లాంట్ డిజైన్, సాంకేతిక బదిలీ కోసం B-2 ఈ-వీసా ద్వారా వేగంగా రావచ్చు.
ఏడాది చివరి నాటికి అమలులోకి నూతన వ్యవస్థ
ప్రస్తుతం ఈ నూతన వీసా విధానానికి అనుగుణంగా హోంశాఖ తన ఐటీ వ్యవస్థలను, వెబ్‌సైట్లను మాడిఫై చేస్తుంది. ఈ ఏడాది చివరినాటికి ఈ సింపుల్ వీసా సిస్టమ్ పూర్తిగా అందుబాటులోకి రానుంది. వ్యాపారం, దౌత్య, పని, జర్నలిస్ట్, మెడికల్, ఆఫీషియల్, స్టూడెంట్, విజిటర్, ఇతర విభాగాల కింద మొత్తం 9 ముఖ్య కేటగిరీలలో సవరించిన వీసాలను జారీ చేయనున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో భారత పర్యాటక రంగానికి, అంతర్జాతీయ పెట్టుబడులకు పెద్ద ఎత్తున ఊతం లభించనుంది.














Click it and Unblock the Notifications
