అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో అడ్మిట్ అయిన గోవిందా
ప్రముఖ నటుడు గోవిందా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ముంబైలో ఆసుపత్రిలో చేరారు. జుహూలోని క్రిటికేర్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో ఆయనకు పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి తన ఇంట్లో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు గోవింద. సొమ్మసిల్లి పడిపోయారు. అపస్మారక స్థితికి చేరుకున్నారు. దీంతో ఆయన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
గోవిందా ఆసుపత్రిలో అడ్మిట్ అయిన విషయాన్ని ఆయన స్నేహితుడు, లీగల్ అడ్వైజర్ లలిత్ బిందాల్ ధృవీకరించారు. అనారోగ్యంతో బాధపడుతున్న గోవిందాకు డాక్టర్ల సలహా మేరకు ఇంట్లో ట్రీట్మెంట్ ఇచ్చామని, వేకువ జామున ఒంటిగంట సమయంలో అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఆయనను జుహూలోని క్రిటికేర్ ఆసుపత్రికి తరలించామని లలిత బిందాల్ తెలిపారు. ప్రస్తుతం ఆయనకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తోన్నారు. వాటి రిపోర్టులు ఏమిటనేది ఇంకా తెలియరావాల్సి ఉంది.

అంతకుముందు రోజు గోవిందా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ నటుడు ధర్మేంద్రను పరామర్శించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ధర్మేంద్ర ముంబై బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను పరామర్శించిన వీడియో వైరల్ అయింది. ధర్మేంద్రను పరామర్శించిన అనంతరం గోవిందా తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు కనిపించారు. పరామర్శించిన వారిలో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఆర్యన్ ఖాన్ వంటి సెలెబ్రిటీలు ఉన్నారు.
కాలికి తుపాకీ గాయం కావడం వల్ల గోవిందా గత ఏడాది అక్టోబర్ లో ఆసుపత్రిలో చేరారు. తన లైసెన్స్‌డ్ రివాల్వర్‌ను క్లీన్ చేస్తోన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అప్పుడు కూడా ఆయన క్రిటికేర్ ఆసుపత్రిలోనే అడ్మిట్ అయ్యారు. సరిగ్గా 13 నెలల తర్వాత మరోసారి ఆసుపత్రి పాలయ్యారాయన.












Click it and Unblock the Notifications