పెళ్లి మండపంలో విషాదం: ఏడడుగులు వేస్తూ కుప్పకూలిన వరుడు
మూడు ముళ్లు, ఏడడుగులతో మరి కొద్ది క్షణాల్లో వివాహ బంధంలోకి అడుగుపెట్టాల్సిన వరుడు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో మండపంలోనే కుప్పకూలిపోయాడు. ఈ విషాద ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
డెహ్రాడూన్: మరణం ఎవరికి ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. అప్పటి వరకు ఆనందంగా, ఉల్లాసంగా గడిపినవారు మరు క్షణంలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల కాలంలో మారిన జీవన శైలిలో కూడా ఇందుకు కారణమవుతోంది. తాజాగా, మూడు ముళ్లు, ఏడడుగులతో మరి కొద్ది క్షణాల్లో వివాహ బంధంలోకి అడుగుపెట్టాల్సిన వరుడు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో మండపంలోనే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రాణిఖేత్‌లో ఓ వివాహ వేడుక జరుగుతోంది. హల్ద్వానీ నందపూర్ కఠ్‌గరియాకు చెందిన సమీర్ ఉపాధ్యాయ్(30) అనే దంత వైద్యుడితో రాణిఖేత్ ప్రాంతానికి చెందిన యువతితో అతనికి వివాహం జరుగుతోంది.

శుక్రవారం వివాహం కావడంతో కుటుంబసబ్యులు ఆనందోత్సాహాల మధ్య ఊరేగింపుతో వరుడిని పెళ్లి మండపం వద్దకు తీసుకొచ్చారు. అనంతరం పురోహితులు వివాహ తంతు మొదలు పెట్టారు. ఈ క్రమంలో వధూవరులతో ఏడడుగులు వేయిస్తుండగా.. సమీర్ ఒక్కసారిగా కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించారు.
అయితే, అప్పటికే సమీర్ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. గుండెపోటు కారణంగానే సమీర్ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. అప్పటి వరకు ఎంతో ఆనందోత్సాహాల మధ్య సందడిగా ఉన్న పెళ్లి మండపంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వరుడు, వధువు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. వివాహ బంధంతో ఒక్కటయ్యే సమయంలో ఇలాంటి ఘోరం జరిగిందని సమీర్ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.












Click it and Unblock the Notifications