మోదీ మెగా రోడ్ షో: 50 కిలోమీటర్లు - 16 నియోజకవర్గాల మీదుగా
అహ్మదాబాద్: గుజరాత్‌లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతోంది. తొలి గంటలో 4.92 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు. మధ్యప్రదేశ్ గవర్నర్ మంగూభాయ్, మాజీ ముఖ్యమంత్రి విజయ్ రుపాణీ, జామ్‌నగర్ నార్త్ నుంచి పోటీ చేస్తోన్న భారతీయ జనత పార్టీ అభ్యర్థిని, టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా, ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే అర్జు మొధ్వాడియా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
గుజరాత్‌లో ఉన్న మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 182. వాటికి కేంద్ర ఎన్నికల సంఘం రెండు దశల్లో పోలింగ్ నిర్వహించనుంది. తొలి విడతలో 19 జిల్లాల్లోని 89 స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. దక్షిణ గుజరాత్, కఛ్, సౌరాష్ట్ర రీజియన్లలోని జిల్లాలు ఇందులో ఉన్నాయి. మిగిలిన 93 స్థానాలకు డిసెంబర్ 5వ తేదీన పోలింగ్ ఉంటుంది. తొలి విడతలో మొత్తం 2,39,76,670 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 1,24,33,362 మంది పురుషులు, 1,1,5,42,811 మంది మహిళలు, 497 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు.

ఈ పరిణామాల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవ్వాళ మెగా రోడ్ షోను నిర్వహించ తలపెట్టారు. ఈ నెల 5వ తేదీన జరుగనున్న చివరిదైన రెండో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోడ్ షో నిర్వహించనున్నారాయన. ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు అహ్మదాబాద్‌లోని నరోదా గామ్ వద్ద ఆరంభమౌతుందీ కార్యక్రమం. 50 కిలోమీటర్ల పొడవున రోడ్ షోను ప్లాన్ చేశారు బీజేపీ రాష్ట్రశాఖ నాయకులు. మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా సాగుతుంది. గాంధీనగర్‌లో ముగుస్తుంది.
మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు సాగే ఈ మెగా రోడ్‌షోలో 35 చోట్ల సమావేశాలను ఏర్పాటు చేశారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాలు, స్మారక కేంద్రాల వద్ద ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. థక్కర్‌బాపు నగర్, బాపూ నగర్, నికోల్, అమ్రేవాడి, మణినగర్, జమాల్‌పూర్ ఖాడియా, ఎలిస్ బ్రిడ్జ్, వెజాల్‌పూర్, సబర్మతి మీదుగా గాంధీనగర్‌లో ముగుస్తుంది.












Click it and Unblock the Notifications