సోనియాతో గులాం నబీ ఆజాద్ భేటీ - కూటమి ఏర్పాటే ప్రధానంగా : రాజీ కుదురుతుందా..!!
కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ భేటీ అయ్యారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ పరాజయం తరువాత జీ 23 నేతలు వరుసగా సమావేశాలు నిర్వహించారు. కాంగ్రెస్ అధినాయకత్వం ఎదుట అనేక డిమాండ్లు ఉంచారు. గాంధీల నాయకత్వ మార్పు అంశం పైన చర్చ జరుగుతున్న వేళ..ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయిదు రాష్ట్రాల్లో పరాజయం తరువాత కాంగ్రెస్ లో ఒక్క సారిగా కలకలం మొదలైంది. సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించారు. రాజీవ్ గాంధీ జన్మదినం నాడు అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు.
అదే విధంగా.. పార్టీ సంస్థాగత ఎన్నికల పైనా ఫోకస్ పెట్టారు. ఆ వెంటనే పరాజయం పాలైన అయిదు రాష్ట్రాల పీసీసీ చీఫ్ లను రాజీనామా చేయాలని సోనియా ఆదేశించారు. అయిదు రాష్ట్రాల్లో ఓటమి పైన అధ్యయనం కోసం పరిశీలకులకు బాధ్యతలు అప్పగించారు. ఇక..ఇదే సమయంలో జీ 23 నేతలు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీని ఎదుర్కోవాలంటే.. 2024 ఎన్నికల్లో అధికారం దక్కాలంటే పార్టీతో భావ సారూప్యత కలిగిన పార్టీలతో కూటమి ఏర్పాటు చేయాలని సూచించారు. పార్టీలోని ప్రతీ స్థాయిలో సమష్టి, సమ్మిళిత నాయకత్వంతోనే సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. పార్టీ సీనియర్ నేత కపిల్ సిబాల్ చేసిన వ్యాఖ్యలు సైతం పార్టీలో చర్చకు కారణమయ్యాయి.

ముకుల్ వాస్నిక్ ను కొత్త అధ్యక్షుడిగా చేయాలంటూ డిమాండ్లు వినిపించాయి. రాజస్థాన్ ముఖ్యమంత్రి గెహ్లాట్ వంటి వారు రాహుల్ నాయకత్వానికి మద్దతుగా నిలిచారు. సిబాల్ వ్యాఖ్యలను తప్పు బట్టారు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల నడుమ.. ఆజాద్ నేరుగా సోనియాతో చర్చలు చేయటం ద్వారా.. పార్టీ లో కొత్త నిర్ణయాలు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదే సమయంలో టీ 23 నేతల డిమాండ్ల పైన సోనియా తన వైఖరి స్పష్టం చేసే అవకాశం ఉంది. ఈ సమావేశం ద్వారా కాంగ్రెస్ లో ఒక విధంగా అసమ్మతి గ్రూపుగా మారిన టీ 23 నేతలు..పార్టీకి మధ్య సయోధ్య కుదురుతుందా లేదా అనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications