బెంబేలెత్తిస్తోన్న తుపాకుల మోత : గన్ షూట్ తో దద్దరిల్లిన వీడియో షూట్..
న్యూయార్క్ : అమెరికాలో పేట్రేగిపోతున్న గన్ కల్చర్.. తాజాగా ఓ లైవ్ వీడియో షూట్ ని టార్గెట్ చేసింది. గన్ షూటర్స్, వీడియో షూటర్స్ ని టార్గెట్ చేయడంతో డాక్యుమెంటరీ కోసం రూపొందిస్తున్న ఆ వీడియో కాస్త విషాదంగా మారిపోయింది. పెర్కిన్స్ అనే ఇద్దరు పిల్లల తండ్రి చికాగోలో తన స్నేహితులతో కలిసి ఫేస్ బుక్ కోసం ఓ వీడియో డాక్యుమెంటరీ చిత్రీకరిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ఘటన జరిగిన తీరును పరిశీలిస్తే.. ఆంటానియో పెర్కిన్స్ చికాగో వీధుల్లొ ఫేస్ బుక్ లైవ్ స్ట్రీమింగ్ డాక్యుమెంటరీని చిత్రీకరిస్తున్నాడు. వీడియో షూట్ చేస్తోన్న సమయంలో అక్కడికి చేరుకున్న ఓ గ్యాంగ్ విచక్షణా రహితంగా పెర్కిన్స్ పై కాల్పులకు తెగబడింది. దీంతో అతని తల, మెడలోకి బుల్లెట్లు దూసుకెళ్లడంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు పెర్కిన్స్.

ఘటన జరిగిన వెంటనే పెర్కిన్స్ ని కొంతమంది వ్యక్తులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే పెర్కిన్స్ మృతి చెందినట్టుగా వైద్యులు ద్రువీకరించారు. కాగా, ఘటనపై స్పందించిన పెర్కిన్స్ తండ్రి డానియల్ కోల్.. అన్యాయంగా తన కొడుకును హతమార్చారని రోధించాడు. మెక్ డొనాల్డ్స్ లో పనిచేస్తూ పెర్కిన్స్ తన ఇద్దరు పిల్లల ఆలనా పాలనా చూసుకునేవాడని వెల్లడించిన డానియల్, పెర్కిన్స్ చనిపోవడంతో ఇప్పడుతని పిల్లలు అనాథలుగా మారారని ఆవేదన వ్యక్తం చేశాడు.
కాగా.. నిందితుల కాల్పులు వీడియో చిత్రీకరణలో స్పష్టంగా రికార్డయినట్టు సమాచారం. దీంతో ఆ వీడియో ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు అక్కడి పోలీసులు. ఇదిలా ఉంటే అమెరికాలో రోజురోజుకి పెరిగిపోతున్న గన్ కల్చర్ పట్ల అక్కడి ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications