మసీదులో ఘంటా నాదం.. వేదమంత్రోచ్ఛారణలు: హిందువుల పూజలకు గ్రీన్ సిగ్నల్
Gyanvapi Mosque: చారిత్రాత్మకమైన వారణాశిలో గల జ్ఞాన్‌వాపి మసీదు వ్యవహారం మరో మలుపు తీసుకుంది. వారణాశిలోని ఈ మసీదులో పూజలను నిర్వహించడానికి హిందువులకు అనుమతి లభించింది. ప్రతి ఒక్క హిందువూ ఇకపై ఈ మసీదులో పూజలు చేసుకోవచ్చు.
మసీదు ఆవరణలో ఉన్న వ్యాస్ కా ఠికానాలో రోజువారీ పూజాదికాలను నిర్వహించుకోవడానికి అవరమైన అనుతులు హిందువులకు లభించాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, సుహృద్భావ వాతావరణంలో పూజలు జరుపుకోవడానికి వారం రోజుల్లోగా జిల్లా అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లను చేయాల్సి ఉంటుంది.

ఈ మేరకు వారణాశి కోర్టు.. అధికారులకు ఆదేశాలను జారీ చేసింది. ఆదేశాలు వెలువడినప్పటి నుంచీ ఏడు రోజుల్లో ఈ ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేయాలంటూ కోర్టు సూచించినట్లు హిందువుల తరఫు న్యాయవాదలు విష్ణుకుమార్ జైన్, సుభాష్ నందన్ చతుర్వేది తెలిపారు. ఏ ఒక్కరికో పరిమితం కాదని, హిందువులందరూ పూజల్లో పాల్గొనవచ్చని కోర్టు ఆదేశించినట్లు చెప్పారు.
జ్ఞాన్‌వాపి మసీదులో శివాలయం ఉందంటూ హిందూ సంఘాలు ముందు నుంచీ చెబుతూ వస్తోన్న విషయం తెలిసిందే. ఈ మేరకు కొందరు హిందూ సంఘాల ప్రతినిధులు మసీదులో పూజలు చేయడానికీ ప్రయత్నించారు గతంలో. జ్ఞాన్‌వాపి మసీదులో శివాలయం ఉండేదని, దాన్ని నేలమట్టం చేశారనేది హిందూ ధార్మిక సంఘాల వాదన.
దీనికి సంబంధించిన పలు సాక్ష్యాధారాలను వారు అప్పట్లో న్యాయస్థానానికి సమర్పించారు. ఈ మసీదులో ప్రాచీన శివలింగం, నంది, కోనేరు కూడా ఉన్నాయని వారు వివరించారు. అక్కడ పూజలను నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలనీ అభ్యర్థించారు. ఈ మేరకు వారు దాఖలు చేసిన పిటీషన్‌ను ఇదివరకు వారణాశి జిల్లా న్యాయస్థానం సింగిల్ బెంచ్ జడ్జి విచారణ చేపట్టింది.

దీనికి కౌంటర్‌గా అంజుమన్ ఇంతెజామియా మసీద్ మేనేజ్‌మెంట్ కమిటీ, సున్నీవక్ఫ్ బోర్డ్ 2021 ఏప్రిల్ 8వ తేదీన వేర్వేరుగా పిటీషన్ దాఖలు చేశాయి. హిందూ ధార్మిక సంఘాల తరఫున విష్ణు శంకర్ జైన్, అంజుమన్ కమిటీ తరఫున సీనియర్ అడ్వొకేట్ మిరాకుద్దీన్ సిద్ధిఖీ తమ వాదనలను వినిపించారు.
మసీదు కాంప్లెక్స్‌లో సంస్కృత శ్లోకాలు, పాత జ్యోతిర్లింగం, హిందూ కళాఖండాలు.. వంటివి ఉన్నాయని జైన్ వాదించారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను ఆయన న్యాయస్థానానికి సమర్పించారు. అలాగే- ఉత్తరం వైపున కొన్ని ఆలయ స్తంభాల నిర్మాణం మధ్యలో ఆగిపోయినట్లు కూడా ఉందని పేర్కొన్నారు.
శివాలయం ఉందా? లేదా? అనేది నిర్ధారించడానికి ఆర్కియాలాజికల్ విభాగంతో సర్వే జరిపించాలంటూ ఆదేశించారు. దీన్ని అంజుమన్ కమిటీ వ్యతిరేకించింది. అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేసింది. మసీదులో శివాలయం ఉందా? లేదా? అనే విషయాన్ని నిర్ధారించేలా పురావస్తు శాఖ సర్వే నిలిపివేయాలంటూ అంజుమన్ కమిటీ పిటీషన్ దాఖలు వేసింది.
ఆయా పిటీషన్లన్నింటి పైనా అలహాబాద్ హైకోర్టు విచారణ జరిపింది. అంజుమన్ కమిటీ, సున్నీ వక్ఫ్ బోర్డ్ దాఖలు చేసిన పిటీషన్లను కొట్టివేసింది. ప్రార్థనా స్థలాల చట్టం 1991 ఆధారంగా ఈ పిటీషన్లను తోసిపుచ్చింది. మసీదులో ఆర్కియలాజికల్ సర్వే నిర్వహణ, ఆలయ పునర్నిర్మాణ పనులకు అంగీకారం తెలిపింది.












Click it and Unblock the Notifications