Holi 2025 Date: మార్చి 14 లేదా 15న, హోలీ పండుగ ఎప్పుడు? పూర్తి వివరాలు ఇవే..
Holi 2025 Date: హోలీ పండుగకు దేశంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగను కులమతాలకు అతీతంగా దేశంలోని ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. కానీ హోలీ పండుగ విషయంలో ప్రజల్లో అనుమానం నెలకొంది. హోలీ పండుగను ఎప్పుడు జరుపుకోవాలని చాలా మందిలో సందేహం కలుగుతోంది. ప్రతి సంవత్సరం చైత్ర మాసంలోని కృష్ణ పక్ష ప్రతిపాద తిధి నాడు హోలీ పండుగను జరుపుకుంటారు. ఈ సారి హోలీ పండుగ మార్చి 14, శుక్రవారం నాడు జరుపుకుంటారు. హోలీకి ఒక రోజు ముందు హోలికను దహనం చేసే సంప్రదాయం ఉంది. అంటే మార్చి 13న హోలికా దహనం జరగుతుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం.. ఫాల్గుణ మాసంలోని పౌర్ణమి రోజున చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా హోలికా దహనం నిర్వహిస్తారు.
హోలికా దహనం ముహూర్తం
హోలికా దహనం ఫాల్గుణ పౌర్ణమి రోజున భద్రకాలం లేని ముహూర్తంలో రాత్రి సమయంలో జరుగుతుంది. పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి మార్చి 13 ఉదయం 10.25 గంటలకు ప్రారంభం అవుతుంది. భద్రకాలం కూడా అదే సమయంలో ప్రారంభమై రాత్రి 11.26 గంటల వరకు ఉంటుంది. ఈ నేపథ్యంలో హోలికా దహనం శుభముహూర్తం మార్చి 13 రాత్రి రాత్రి 11.26 నుంచి అర్ధరాత్రి 12.30 గంటల వరకు ఉంటుంది. అర్ధరాత్రి సమయంలో హోలికా దహనం జరుగుతుంది. అంటే భద్రకాలం ముగిసిన తర్వాత హోలికా దహనం జరుగుతుంది.

హూలికా దహనం పద్ధతి
హోలికా దహనం సమయంలో ఒక చెట్టు కొమ్మను నేలపై ఉంచి అన్ని వైపుల నుంచి కట్టెలు, ఆవు పేడ పిడకలతో కప్పుతారు. దానిపైన ఆవుపేడతో చేసిన హోలిక, ప్రహ్లాదుని విగ్రహాలను ఉంచుతారు. శుభసమయంలో మంటను వెలిగిస్తారు. ఈ అగ్నిలో ఆవు పేడ పిడకలు, కొత్త గోధుమ కంకులను సమర్పిస్తారు. ఈ అగ్ని ఏడాది పొడవునా ఆరోగ్యంగా ఉంచుతుందని, ప్రతికూల శక్తులను నాశనం చేస్తుందని నమ్ముతారు. హోలికా దహనం తర్వాత చితాభస్మాన్ని ఇంటిని తీసుకెళ్లి బొట్టు పెట్టుకునే సంప్రదాయం ఉంది. దీనిని చాలా చోట్ల చోటీ హోలీ అని కూడా పిలుస్తారు. హోలికా దహనం చేసేటప్పుడు శుభ్రమైన స్థలాన్ని ఎంచుకోవాలి. పొరపాటున ఏ ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు పాటించాలి,
వివిధ ప్రాంతాలలో హోలీ పండుగ ఇలా
దేశంలోని ప్రతి ప్రాంతంలో హోలీ పండుగను భిన్న పద్దతుల్లో జరుపుకుంటారు. మధ్యప్రదేశ్ లోని మాల్వా ప్రాంతంలో ప్రధాన హోలీ పండుగ కంటే ఎక్కువగా ఐదో రోజున రంగ పంచమి జరుపుకుంటారు. బ్రజ్ ప్రాంతంలో హోలీ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. బర్సానాలో లాథ్మార్ హోలీ ఆడతారు. మధుర, బృందావన్ లలో హోలీని 15 రోజులు జరుపుకుంటారు. మహారాష్ట్రలో రంగ పంచమి రోజున పొడి గులాల్ తో హోలీ ఆడడం ఒక సంప్రదాయం. దక్షిణ గుజరాత్ గిరిజనులకు హోలీ అతిపెద్ద పండుగ. ఛత్తీస్‌గఢ్‌లో జానపద పాటలు బాగా ప్రాచుర్యం పొందాయి. మాల్వా ప్రాంతంలో హోలీని భాగోరియా అని పిలుస్తారు.
హోలీ పండుగ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
హోలీ అంటేనే రంగుల పండుగ. హోలీ ఆడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో ఎక్కువగా రసాయనాలతో తయారు చేసిన రంగులను వాడుతున్నారు. అలా వాడడం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో చర్మానికి నష్టం జరగకుండా ఉండేందుకు సేంద్రీయ, సహజమైన రంగులను ఎంచుకంటే మంచిది. చర్మానికి ఇబ్బంది కలిగించే రంగులకు దూరంగా ఉండడమే మంచిది. హోలీ ఆడే ముందు జుట్టుకు నూనె రాస్తే రంగులు సులభంగా వదిలిపోతాయి. కళ్లకు అద్దాలను పెట్టుకుంటే కళ్లల్లో రంగులు పడే ప్రమాదం తక్కువగా ఉంటుంది.
హోలీ ప్రాముఖ్యత
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఫాల్గుణ మాసంలోని పౌర్ణమి రోజున హోలికా దహనం నిర్వహిస్తారు. పురాణాల్లోని కథ ప్రకారం.. హిరణ్యకశ్యపుని కుమారుడు ప్రహ్లాదుడు విష్ణువుకు పరమ భక్తుడు. కానీ హిరణ్యకశ్యపునికి ఇది అస్సలు నచ్చలేదు. బాల ప్రహ్లాదుని దైవ భక్తి నుంచి దూరం చేసే పనిని అతను తన సోదరి హోలికకు అప్పగించాడు. ఎందుకంటే ఆమె శరీరాన్ని అగ్ని కాల్చలేదని వరం ఆమెకు ఉంది. భక్తుడైన ప్రహ్లాదుడిని చంపాలనే ఉద్దేశంతో హోలిక అతడిని తన ఒడిలోకి తీసుకుని అగ్నిప్రవేశం చేసింది. కానీ ప్రహ్లాదుని భక్తి, దేవుడి దయ కారణంగా హోలిక స్వయంగా అగ్నిలో కాలిపోయింది. ప్రహ్లాదుడి శరీరానికి ఎటువంటి హాని జరగలేదు. అప్పటి నుంచి హోలీ మొదటి రోజున హోలికా దహనం నిర్వహిస్తారు.












Click it and Unblock the Notifications