రాజ్‌నాథ్ ఫోన్: ఏపి బిజెపి అధ్యక్షుడిగా హరిబాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర) రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా కంభంపాటి హరిబాబు నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు గురువారం బిజెపి జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. కంభంపాటి హరిబాబు గతంలో విశాఖ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా కూడా ఆయన విధులు నిర్వహించారు.
జూన్ 2న రెండు రాష్ట్రాలు ఆవిర్భవించనున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు ఇద్దరు అధ్యక్ష్లులు ఉండాలని నిర్ణయించిన బిజెపి ఈ మేరకు సీమాంధ్ర ప్రాంతానికి పార్టీ అధ్యక్షుడిగా కంభంపాటి హరిబాబును నియమించినట్లు తెలుస్తోంది. సీమాంధ్రలోని పలువురు పార్టీ నేతలతో చర్చించిన జాతీయ నాయకులు ఆ తర్వాత హరిబాబును అధ్యక్షుడిగా నిమించినట్లు సమాచారం.

ఈ సందర్భంగా కంభంపాటి హరిబాబు మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించడం పట్ల రాజ్‌నాథ్ సింగ్, పార్టీ అగ్ర నాయకులకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు.
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రధాని కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. మోడీ గెలుపు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హరిబాబు చెప్పారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కంభంపాటి హరిబాబు అధ్యక్షుడిగా నియామకం అవడంతో రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికే అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తించనున్నారు.












Click it and Unblock the Notifications