Heat waves డేంజర్‌లో తెలుగు రాష్ట్రాలు..అభివృద్ధిపై వడగాలుల పిడుగు..!
వేసవికాలంలో వడగాలులు తీవ్రత ఎక్కువగా ఉంటోంది.వడగాలుల ప్రభావం ప్రజారోగ్యం, వ్యవసాయం, ఇతర సామాజిక ఆర్థిక సాంస్కృతుల వ్యవస్థలపై పడుతోంది. ఈ విషయాన్ని తన పరిశోధన ద్వారా వెల్లడించారు రమిత్ దేవ్‌నాథ్. ఈయన యూనివర్శిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్‌లో స్కాలర్‌గా ఉన్నారు.వాతావరణంలో మార్పుల ద్వారా ఉత్పన్నమవుతున్న వడగాలులు భారతదేశం ముందున్న స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలకు లేదా అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని రమిత్ దేబ్‌నాథ్ బృందం స్పష్టం చేసింది.
ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు భారత్ అన్ని విధాల ప్రయత్నిస్తోంది.ఇందులో పేదరిక నిర్మూలన,ఆరోగ్యం,సంక్షేమం,ఉపాధి మరియు ఆర్థికాభివృద్ధి అంశాలున్నాయి.అయితే ప్రస్తుతం దేశంలో ఉన్న వడగాలులు ఈ అంశాలపై తీవ్ర ప్రభావం చూపుతూ లక్ష్యాలను చేరుకోకుండా అడ్డుకుంటున్నాయని రమిత్ బృందం వివరించింది.

భారత్‌లో ప్రమాద ఘంటికలు మోగిస్తున్న వాతావరణ మార్పులు,ఆ మార్పులు స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల పురోగతిని ఎలా అడ్డుకుంటున్నాయో తెలుసుకునేందుకుపరిశోధకుల భారత దేశపు ఉష్ణోగ్రతల సూచికపై స్టడీ చేశారు. అవి ఏ మేరకు ప్రజల జీవనోపాధిపై ప్రభావం చూపుతున్నాయి, సామాజిక ఆర్థిక పరిస్థితి ఇతరత్ర అంశాలపై ప్రభావం చూపుతున్నాయో విశ్లేషించారు. ఆ తర్వాత 2001-2021 వరకు అంటే 20 ఏళ్లలో ఈ అంశాలు స్థిరమైన అభివృద్ది లక్ష్యాలను ఎలా ప్రభావితం చేశాయో పోల్చి చూశారు.
ఈ పరిశోధనల్లో భారత్‌లో వీచే వడగాలులు స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలకు ఆటంకంగా మారినట్లు రమిత్ దేబ్‌నాథ్ బృందం పేర్కొంది. ఉదాహరణకు భారత్‌లోని ఉష్ణ సూచికలను గమనిస్తే 90శాతంకు పైగా వడగాలుల ప్రభావం దేశంపై ఉందని తేల్చారు. ముందుగా గత 20 ఏళ్లలో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల పురోగతిని వాతవరణంలో చోటు చేసుకున్న మార్పుల ద్వారా సంభవించిన మరణాలను పోల్చి చూశారు. భారతదేశ యొక్క స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో వడగాలులు అడ్డంకిగా మారాయని పరిశోధన ద్వారా బృందం తేల్చింది.
ఇక ఈ పరిశోధనల ద్వారా సేకరించిన డేటా పలు అంశాలను వెల్లడిస్తోంది. భారత్‌లోని పలు రాష్ట్రాల్లో స్థిరమైన అభివృద్ధి కనిపించడం లేదంటే ఇందుకు కారణం వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులే అని తేల్చేశారు. ముఖ్యంగా వడగాలులు ఈ పురోగతిని అడ్డుకుంటున్నాయని కనుగొన్నారు.ఈ వడగాలులు భవిష్యత్తులో మరింత ఉగ్రరూపం దాలుస్తాయని హెచ్చరించారు. తెలుగు రాష్ట్రాలకు కూడా వడగాలుల ప్రమాదం పొంచి ఉంది.

ప్రభుత్వాలు, వాతావరణ నిపుణులు వెంటనే జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులను పసిగట్టి వాటికి పరిష్కార మార్గాలు కనుగొనాలని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సమస్యలు పరిష్కరించడంలో ప్రపంచ దేశాలు అనుసరిస్తున్న చర్యలను భారత్ కూడా అమలు చేస్తే నష్టం కొంతవరకు నివారించొచ్చని సూచిస్తున్నారు.
చివరిగా రమిత్ దేవ్‌నాథ్ మరో హెచ్చరిక జారీ చేశారు. భారత్‌లో వడగాలుల తీవ్రత వేగంగా పెరుగుతోందని ఇప్పటికే దేశంలో నివసిస్తున్న 80శాతం మంది ప్రజలు డేంజర్ జోన్‌లో ఉన్నట్లు చెప్పారు.అయితే వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులతో మరణాలు సంభవిస్తే వాటిని పరిగణలోకి తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ఈ పరిస్థితిని వెంటనే చక్కబెట్టకపోతే భారత్ నిర్దేశించుకున్న స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడం పెనుసవాలుగా మారుతుందని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications