కర్నాటకను ముంచెత్తుతున్న వరదలు.. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు
బెంగళూరు: కర్నాటకలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే కురుస్తున్న వర్షాలకు భారీగా నష్టం వాటిల్లింది. ఇక రాష్ట్ర రాజధాని బెంగళూరులో రానున్న రెండ్రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. ఇందులో భాగంగా కర్నాటకలోని పలు జిల్లాలకు రెడ్ మరియు ఆరెంజ్ అలర్ట్‌లను జారీ చేసింది భాతర వాతావరణశాఖ కేంద్రం. పలు రిజర్వాయర్లలోకి వరదనీరు వచ్చి చేరుతుండటంతో అవి నిండుకుండను తలపిస్తున్నాయి. ఏ క్షణమైనా రిజర్వాయర్ల గేట్లు ఎత్తివేసే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ప్రభుత్వం సూచించింది.
Recommended Video
కొన్ని జిల్లాలకు ఆరెంజ్ రెడ్ అలర్ట్ జారీ
బెలగావిలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో అక్కడి స్కూళ్లు కాలేజీలకు సెలవులను ప్రకటించారు. బెలగావి, బాగల్‌కోట్, విజయపురా జిల్లాల్లో శుక్రవారం వరకు సెలవు ప్రకటించారు. రానున్న నాలుగు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పలు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ మరికొన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు, పశువులు, ఇళ్లు సురక్షితంగా ఉండేలా చూసేందుకు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యిందంటే ప్రభుత్వ యంత్రాంగం రానున్న విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అర్థం. ఎల్లో అలర్ట్ జారీ చేసిందంటే వాతావరణంలో మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ జాగ్రత్తతో వ్యవహరించాలని అర్థం.
7 నుంచి 12 సెంటీమీటర్ల వర్షం
ఆరెంజ్ అలర్ట్ అంటే భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని.. రెడ్ అలర్ట్ అంటే మరింత భారీ వర్షాలు కురుస్తాయని అర్థం. అంటే 7 నుంచి 12 సెంటీమీటర్లు లేదా 12 నుంచి 20 సెంటీమీటర్ల మేరా వర్షం కురుస్తుందని అర్థం.కర్నాటక తీర ప్రాంతాల్లో అక్టోబర్ 25వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలుండగా కొన్ని చోట్ల సాధారణ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
బెలగావి ఆలయంలోకి పోటెత్తిన వరద
ఇదిలా ఉంటే భారీ వర్షాలకు కర్నాటకలోని యాద్‌గిరిలో ఉన్న నారాయణపూర్ చాయా భాతవతి ఆలయం వరద నీటిలో మునిగిపోయింది. పాలార్ ప్రాంతంలోని మహదేశ్వర కొండల్లో రహదారి పూర్తిగా ధ్వంసమైంది. ఈ కొండలు తమిళనాడు కర్నాటక సరిహద్దుల్లో ఉంటాయి.మరోవైపు బెలగావిలోని ఎల్లమ్మ ఆలయంలోకి వరదనీరు పోటెత్తింది. భారీ వర్షాలకు దార్వాడ్, బెలగావి, కలబురగి, గదగ్, విజయ్‌పుర, బాగల్‌కోట్, శివమొగ్గ, చిక్కమంగళూరులు భారీగా నష్టపోయాయి. రెండు నెలల క్రితం పోటెత్తిన వరదలతో బెలగావి పూర్తిగా కోలుకోక ముందే మళ్లీ వరదలు ముంచెత్తాయి.












Click it and Unblock the Notifications