తమిళనాడును ముంచెత్తిన భారీ వర్షాలు.. ఆ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ
తమిళనాడుని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా నీలగిరి జిల్లాలో భారీ వర్షాల ధాటికి కొండ చరియలు విరిగిపడుతున్నాయి. దాంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కొండ ప్రాంతాలు కావడంతో భారీ వర్షాల కారణంగా ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే ఊటీ, కూనూర్ అలాగే కోటగిరి ప్రాంతాల్లో పర్యటకులను నిషేధిస్తూ అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు చెన్నైలోని ది రీజినల్ మెటీరియోలాజికల్ సెంటర్ నీలగిరి జిల్లాను రెడ్ అలర్ట్ జాబితాలో పోస్టు చేసింది. వర్షాల కారణంగా ఈ మౌంటెయిన్ రూట్స్ తీవ్రంగా దెబ్బతిన్నాయని టూరిస్టులు, వాహనదారులు ఈ మేరకు వార్నింగ్ ఇష్యూ చేసింది.
నీలగిరి జిల్లా కలెక్టర్ లక్ష్మీ భవ్య కీలక సూచనలు చేశారు. మెట్టుపాళయం నుంచి ఊటీ వెళ్తున్న పర్యటకులు కూనూర్ అలాగే కోటగిరి నుంచి ప్రయాణం చేయరాదని పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలో భీకర వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా టూరిస్టులు, వాహనదారులు తమ ప్రయాణాలను మరోసారి పున సమీక్షించుకోవాలని కోరారు. ఈ రూట్లలో ఇప్పటికే కొండ చరియలు విరిగిపడడం, పెద్ద పెద్ద చెట్లు కూలిపోయాయని తెలిపారు. ఈ క్రమంలో ప్రజలు ఎవరూ ఈ ప్రాంతాల్లో ప్రయాణం చేయవద్దని నీలగిరి జిల్లా కలెక్టర్ లక్ష్మీ భవ్య కోరారు. నీలగిరి జిల్లాలో భీకర వర్షాల కారణంగానే రెడ్ అలర్ట్ ను జారీ చేశామని స్పష్టం చేశారు.

ఇదిలాఉంటే నీలగిరి, కోయంబత్తూరు జిల్లాల్లో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఈ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. బార్లియర్ సమీపంలోని మెట్టుపాళయం నుంచి ఊటీ వెళ్లే రోడ్డుపై కొండచరియలు విరిగిపడడంతో ప్రభుత్వ బస్సు డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. అలాగే కండక్టర్ కు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే రహదారిపై పెద్ద ఎత్తున మట్టి, రాళ్లు, బండరాళ్లు పడటంతో పాటు చెట్లు నేలకొరిగాయి. దాంతో అక్కడి పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. రహదారిపై సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ మేరకు విపత్తు నిర్వహణ బృందాలు, అగ్నిమాపక, రక్షణ సిబ్బందితోపాటు హైవేస్ శాఖ అధికారులు సహాయక చర్యల్ని వేగవంతం చేశారు.












Click it and Unblock the Notifications
