బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు బిగ్ చెక్..!!
బెంగళూరు ట్రాఫిక్ గురించి ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా ట్రాఫిక్ జామ్ అనేది సర్వసాధారణం ఇక్కడ. బెంగళూరు నుంచి హైదరాబాద్, చెన్నై, ముంబై వంటి ప్రధాన నగరాలకు వైపు వెళ్లే మార్గాల్లో ప్రైవేట్ బస్సుల వల్ల రాత్రిళ్లు కూడా హెవీగా వాహనాల రాకపోకలు స్తంభించిపోతుంటాయి. దీనిదెబ్బకు కొన్ని ప్రైవేట్ సంస్థలు తమ కార్యలయాలను ఇతర ప్రాంతాలు, నగర శివార్లకు రీలొకేట్ అయిన సందర్భాలు సైతం లేకపోలేదు.
ఈ ట్రాఫిక్ కష్టాలను తొలగించడానికి బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ అధికారులు ఫ్లైఓవర్ల విస్తరణ చేపట్టారు. వాహనాల తాకిడి అధికంగా ఉండే మార్గాల్లో ఫ్లైఓవర్లను విస్తరిస్తోన్నారు. ఇప్పుడున్న వాటికి అదనంగా లూప్ లను నిర్మిస్తోన్నారు. అత్యంత రద్దీగా ఉండే హెబ్బాళ ఫ్లైఓవర్ విస్తరణ, లూప్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇది అందుబాటులోకి వస్తే- నగర శివార్లల్లో ఉండే కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు హైదరాబాద్ వైపు రాకపోకలు సాగించే వాహనాలను ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

హెబ్బాళ ఫ్లైఓవర్ లూప్ నిర్మాణ పనులకు సంబంధించిన ఫొటోలను గ్రేటర్ బెంగళూరు అథారిటీ అధికారులు విడుదల చేశారు. షట్టరింగ్, రీఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యకలాపాలు చురుగ్గా సాగుతున్నాయని వివరించారు. త్వరలో దీన్ని అందుబాటులోకి తీసుకొస్తామని, దీనివల్ల ట్రాఫిక్ మరింత సులభతరం అవుతుందని వివరించారు. నార్త్ బెంగళూరు నుండి నగరానికి ప్రయాణం అవాంతరాలు లేకుండా, వేగంగా సాగుతుందని చెప్పారు.
దీంతో పాటు- బెంగళూరులో ట్రాఫిక్ ను మెరుగుపరచడానికి, వాహనాల రాకపోకలను క్రమబద్దీకరించడానికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మొబిలిటీ డిజిటల్ ట్విన్ అందుబాటులోకి రానుంది. ఈ దిశగా ముందడుగు పడింది. ట్రాఫిక్ ను పర్యవేక్షించడానికి ఉద్దేశించిన వర్చువల్ మోడల్ ఇది. బెంగళూరు సిటీ రోడ్ సేఫ్టీ అండ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ కింద కోటి రూపాయల అంచనాతో ఈ ప్రాజెక్ట్ కోసం పోలీస్ శాఖ టెండర్లను కూడా ఆహ్వానించింది.
AI-ఆధారిత ట్రాఫిక్ మేనేజ్మెంట్ కు సంబంధించిన ఈ టెక్నాలజీని అందుబాటులోకి రావడం దేశంలో ఇదే మొదటిసారి అవుతుంది. ఇది అమలులోకి వస్తే బెంగళూరు ట్రాఫిక్ నిర్వహణ కోసం 'డిజిటల్ ట్విన్' వినియోగిస్తోన్న ప్రపంచ నగరాల సరసన చేరుతుంది. న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, మాస్కో, బార్సిలోనా వంటి నగరాలు అర్బన్ మొబిలిటీ కోసం డిజిటల్ ట్విన్‌లను ఉపయోగిస్తున్నాయి. AI, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీని రియల్ టైమ్ ట్రాఫిక్ డేటాను క్రమబద్దీకరిస్తుంది. ఫలితంగా ట్రాఫిక్ జామ్ ను నివారించవచ్చు.












Click it and Unblock the Notifications