చేయూత: బులంద్‌షహర్ అల్లర్లలో మృతి చెందిన పోలీస్ అధికారి కుటుంబానికి రూ.70 లక్షలు సహాయం
గతేడాది డిసెంబర్‌లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్ షహర్ అల్లర్లలో మృతిచెందిన పోలీసు అధికారి సుబోద్ కుమార్ సింగ్ కుటుంబానికి పోలీస్ శాఖ రూ. 70 లక్షలు విరాళంగా ఇచ్చింది. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం సుబోద్ కుమార్ కుటుంబానికి అంతకుముందు పరిహారంగా అందజేసిన రూ.50 లక్షలకు ఇది అదనం అని ఓ పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు.
బులంద్ షహర్‌లో గోవు కళేబరం దొరకడంతో అక్కడ అల్లర్లు ప్రారంభమయ్యాయి. హిందూ సంఘాలకు చెందిన కొందరు వ్యక్తులు ఘటనా ప్రాంతానికి చేరుకుని పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. అంతేకాదు ఓ సామాజిక వర్గానికి చెందిన వారు గోవధకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే ఆగ్రహంతో ఊగిపోయిన గ్రామస్తులు హిందూ సంఘం వ్యక్తులు గోవు కళేబరాన్ని ట్రాక్టరుకు కట్టి చింగ్వర్తి పోలీస్ చౌక్ దగ్గరకు తీసుకొచ్చి ధర్నా చేశారు. గోవధకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు.

అయితే వారిని అక్కడినుంచి చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. హింస తీవ్రతరం అయ్యింది. పోలీస్ అధికారి సుబోధ్ సింగ్ కుమార్‌ను భజ్రంగ్ దళ్ నేత యోగేష్ రాజ్ చంపేశారన్న ఆరోపణలు రావడంతో ఆయన్ను ఖూర్జా ప్రాంతంలో పోలీసులు అరెస్టు చేశారు. అయితే అల్లర్లు జరిగిన సమయంలో తాను అక్కడ లేనని చెబుతూ ఓ వీడియోను కూడా రాజ్ విడుదల చేశాడు. పోలీసులు కావాలనే తనను కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని రాజ్ మండిపడ్డాడు.












Click it and Unblock the Notifications