Hindu Marriage: హిందూ వివాహాన్ని సంవత్సరంలోపు రద్దు చేయలేం: కోర్టు
Hindu Marriage: ఇద్దరు హిందువుల మధ్య వివాహం పవిత్రమైనదని, హిందూ వివాహ చట్టం ప్రకారం అసాధారణమైన కష్టాలు లేదా పరిస్థితులు ఉంటే తప్ప వివాహం జరిగిన ఒక సంవత్సరం లోపు దానిని రద్దు చేయలేమని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. జస్టిస్ అశ్వనీకుమార్, జస్టిస్ దోనాడి రమేష్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. సెక్షన్ 14 వివాహ తేదీ నుంచి విడాకుల కోసం దాఖలు చేయడానికి ఒక సంవత్సర పరిమితిని కల్పిస్తుందని తెలిపింది. అసాధారణమైన కష్టాలు ఉంటేనే అటువంటి పిటిషన్ ను స్వీకరించవచ్చని ధర్మాసనం పేర్కొంది.
హిందూ వివాహ చట్టం 1955లోని సెక్షన్ 13-బి కింద నిశాంత్ భరద్వాజ్, రిషిక గౌతమ్ అనే దంపతులు పరస్పరం వివాహాన్ని రద్దు చేసుకోవాలని దాఖలు చేసుకున్నారు. అయితే చట్టంలోని సెక్షన్ 14 కింద అందించిన దరఖాస్తును.. కనీస వ్యవధి ముగియలేదనే కారణంతో సహారన్ పూర్ లోని ఫ్యామిలీ కోర్టు జడ్జి దానిని తిరస్కరించారు.

జనవరి 15న ఇచ్చిన తీర్పులో ఫ్యామిలీ కోర్టు ఆదేశాన్ని సవాలు చేస్తూ భరద్వాజ్ దాఖలు చేసిన మొదటి అప్పీల్ ను డివిజన్ బెంచ్ కొట్టివేసింది. ఒక సంవత్సరం వ్యవధి ముగిసిన తర్వాత రెండు పార్టీలు కొత్త దరఖాస్తును దాఖలు చేసే అవకాశం కల్పించింది. వివాహం జరిగిన ఒక సంవత్సరం లోపు విడాకులకు దాఖలు చేయడానికి అసాధారణ పరిస్థితి ఏదీ లేదని బెంచ్ పేర్కొంది. చట్టంలోని సెక్షన్ 14 నిబంధన కింద ఎటువంటి అసాధారణ కష్టం చూపకపోతే విడాకుల పిటిషన్ ను తిరస్కరించవచ్చని కోర్టు స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications