Top Gun: బీహార్ చిన్నది.. భారత్‌కే గర్వకారణమైంది! ఎవరీ భావనా కాంత్?
భారత ఎయిర్ ఫోర్స్ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో మన మహిళా పైలట్లు సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. గగనతలంలో శత్రువుల గుండెల్లో నిద్రపోయే వ్యూహాలను రచించడంలో బీహార్‌కి చెందిన స్క్వాడ్రన్ లీడర్ భావనా కాంత్ సరికొత్త మైలురాయిని అధిగమించారు. గ్వాలియర్‌లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన 'టాక్టిక్స్ అండ్ ఎయిర్ కాంబాట్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్' అందించే 'ఫైటర్ కాంబాట్ లీడర్'కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన తొలి భారతీయ మహిళా ఫైటర్ పైలట్‌గా ఆమె చరిత్ర పుటల్లోకెక్కింది. దీనితో భారత వైమానిక దళానికి మొదటి మహిళా 'టాప్ గన్' పైలట్ లభించినట్లయింది.
అత్యంత కఠినమైన 20 వారాల శిక్షణ
ఇది సాధారణ కోర్సు కాదు.. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన శిక్షణలలో ఒకటిగా దీనికి పేరుంది. ఏకంగా 20 వారాల పాటు సాగే ఈ అడ్వాన్స్‌డ్ కాంబాట్ ప్రోగ్రామ్‌కు ఎంతో ప్రతిభ ఉన్న కొద్దిమంది ఫైటర్ పైలట్లను మాత్రమే ఎంపిక చేస్తారు.

అమెరికా నావికాదళంలో అత్యంత ప్రసిద్ధి చెందిన 'టాప్ గన్' కోర్సుతో దీన్ని పోలుస్తారు. అత్యంత కష్టతరమైన గగనతల పోరాట వ్యూహాలు, ఆపరేషన్ ప్లానింగ్, శత్రు స్థావరాలపై దాడులు చేయడం వంటి ఎన్నో సంక్లిష్టమైన విమాన విన్యాసాల్లో ఇందులో ట్రైనింగ్ ఇస్తారు. ఈ కోర్సు పూర్తి చేయడంతో భావనా కాంత్ ఇకపై యుద్ధ సమయంలో కీలకమైన ఎయిర్ మిషన్లకు నేతృత్వం వహించే స్థాయికి చేరారు.
మొదటి నుంచీ రికార్డుల పరంపర
బీహార్‌లోని దర్భంగా జిల్లాకు చెందిన భావనా కాంత్ ఇంజనీరింగ్ చదివారు. జూన్ 2016లో అవనీ చతుర్వేది, మోహనా సింగ్‌లతో కలిసి భారత వైమానిక దళంలో చేరిన తొలి మహిళా ఫైటర్ పైలట్ల బ్యాచ్‌లో ఆమె ఒకరిగా నిలిచారు. ఆ తర్వాత 2019లో పగటిపూట ఫైటర్ జెట్‌తో యుద్ధ మిషన్లను నిర్వహించడానికి అనుమతి పొందిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించారు. మొదట్లో మిగ్-21 బైసన్ విమానాన్ని నడిపిన ఆమె, ఆ తర్వాత అత్యంత శక్తివంతమైన సుఖోయ్-30 యుద్ధ విమానాన్ని నడిపే స్థాయికి ఎదిగారు. అంతేకాకుండా 2021లో గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొన్న తొలి మహిళా ఫైటర్ పైలట్‌గానూ, 2024 రిపబ్లిక్ డే ఫ్లైపాస్ట్‌లో విమానం నడిపి దేశ ప్రజల నీరాజనాలు అందుకున్నారు.
మహిళా శక్తికి నిలువెత్తు నిదర్శనం
భారత రక్షణ రంగంలో మహిళలకు నానాటికీ ప్రాధాన్యం పెరుగుతోందనడానికి భావనా కాంత్ సాధించిన ఈ ఘనతే అతిపెద్ద ఉదాహరణ. సైనిక రంగంలో అత్యున్నత నాయకత్వ బాధ్యతలను స్వీకరించడంలో, కఠినమైన యుద్ధ వ్యూహాలను అమలు చేయడంలో మహిళలు ఎవరికీ తీసిపోరని ఆమె మరోసారి నిరూపించారు. ఆకాశంలో మన సరిహద్దులకు కాపలాగా ఉంటూ, దేశ యువతకు ముఖ్యంగా ఆడపిల్లలకు భావనా కాంత్ ఒక గొప్ప స్ఫూర్తిప్రదాతగా నిలుస్తున్నారు.




Click it and Unblock the Notifications