బాలిక చేయిని పట్టుకుని... ప్యాంట్ జిప్ ఓపెన్ చేసి.. దాన్ని నేరంగా పరిగణించలేమన్న బాంబే హైకోర్టు..
బాలికపై లైంగిక దాడికి సంబంధించి ఇటీవల షాకింగ్ తీర్పును వెలువరించిన బాంబే హైకోర్టులోని నాగపూర్ సింగిల్ బెంచ్ తాజాగా అదే తరహాలో మరో సంచలన తీర్పునిచ్చింది. బాలిక చేతిని పట్టుకుని ప్యాంట్ జిప్ తెరిచినంత మాత్రానా పోక్సో చట్టం కింద దాన్ని లైంగిక దాడిగా పరిగణించలేమని పేర్కొంది. ఐపీసీ సెక్షన్ 354-A(1) ప్రకారం అది లైంగిక వేధింపుల కిందకు వస్తుంది తప్ప.. పోక్సో చట్టం ప్రకారం లైంగిక దాడి కిందకు రాదని స్పష్టం చేసింది. ఐదేళ్ల బాలికపై 50 ఏళ్ల ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన కేసులో న్యాయమూర్తి పుష్ప గనెదివాలా ఈ తీర్పునిచ్చారు.
దుస్తుల పైనుంచి స్తనాలను నొక్కడం లైంగిక దాడి కాదా..? బాంబే హైకోర్టు సంచలన తీర్పు...

ఇదీ కేసు నేపథ్యం...
బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. నిందితుడు తన ప్యాంట్ జిప్ ఓపెన్ చేసి పురుషాంగాన్ని బయటపెట్టడం... ఐదేళ్ల తన కుమార్తె చేయిని పట్టుకోవడం తాను చూశానని ఫిర్యాదులో ఆమె పేర్కొంది. అంతేకాదు,తనతో వచ్చి బెడ్‌పై పడుకోవాలని అతను చెప్పాడని... ఈ విషయం తన కుమార్తె చెప్పిందని తెలిపింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన సెషన్స్ కోర్టు పోక్సో చట్టంలోని సెక్షన్స్-10 కింద అతన్ని దోషిగా తేల్చింది. ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.25వేలు జరిమానా విధించింది.

పోక్సో చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం...
సెషన్స్ కోర్టు ఇచ్చిన ఈ తీర్పును నిందితుడు బాంబే హైకోర్టులోని నాగపూర్ సింగిల్ బెంచ్‌లో సవాల్ చేశాడు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు... ఈ కేసు లైంగిక వేధింపుల కిందకు వస్తుంది తప్ప లైంగిక దాడి కిందకు రాదని పేర్కొంది. పోక్సో చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం.. ఎవరైనా లైంగిక ఉద్దేశంతో బాలిక జననాంగాలు,ఇతరత్రా సున్నిత ప్రదేశాల్లో తాకితే లేదా వారి చేత తమ జననాంగాలను తాకేలా చేయిస్తే.. లేదా సంభోగం మినహా శారీరక స్పర్శతో కూడిన లైంగిక చర్యలకు పాల్పడితే దాన్ని లైంగిక దాడిగా పరిగణించవచ్చునని పోక్సో చట్టం చెబుతోందన్నారు.

పోక్సో చట్టం కింద అతను నిర్దోషి...
లైంగిక దాడి నిర్వచనం ప్రకారం... లైంగిక ఉద్దేశంతో సంభోగం మినహా శారీరక స్పర్శతో కూడిన చర్యలకు పాల్పడటం ఈ నేరంలో కీలకమని కోర్టు పేర్కొంది. ఈ కేసులో అసలు జననాంగాలను నేరుగా తాకడం జరగలేదని పేర్కొంది. కాబట్టి దీన్ని పోక్సో చట్టం కింద నేరంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. పోక్సో చట్టంలోని సెక్షన్ 8,10,12ల కింద అతన్ని నిర్దోషిగా తేల్చింది. అదే సమయంలో సెక్షన్ 354A(1) ప్రకారం అతన్ని దోషిగా తేల్చింది. ఈ చట్టం కింద మూడేళ్ల పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.

ఇటీవలి తీర్పుపై సుప్రీం స్టే...
ఇటీవలే 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడి కేసులోనూ బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. బాలిక స్తనాలను దుస్తుల పైనుంచి తాకడాన్ని పోక్సో చట్టం కింద లైంగిక దాడిగా పరిగణించలేమని కోర్టు పేర్కొంది. స్కిన్-టు-స్కిన్(శారీరక స్పర్శ) కాంటాక్ట్ ఉంటేనే దాన్ని లైంగిక దాడిగా పరిగణించవచ్చునని పేర్కొంది. కాబట్టి ఈ చట్ట ప్రకారం అతని చర్యను నేరంగా పరిగణించలేమని అతను నిర్దోషి అని ప్రకటించింది. అయితే ఈ తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేయగా... సీజేఐ ఎస్ఏ బోబ్డే నేత్రుత్వంలోని ధర్మాసనం దీనిపై స్టే విధించింది.