న్యూడ్ ఫోటోల కోసం యుద్ధ రహస్యాలు అమ్మేశాడు..
దేశ రక్షణకు వెన్నెముకగా నిలవాల్సిన ఒక ఉన్నత స్థాయి సైనికాధికారి, శత్రుదేశపు హనీ ట్రాప్ లో చిక్కుకుని దేశ భద్రతనే తాకట్టు పెట్టాడు. అసభ్యకర ఫోటోలకు ఆశపడి భారత వైమానిక దళానికి (IAF) చెందిన అత్యంత రహస్య యుద్ధ ప్రణాళికలను పాకిస్థాన్ గూఢచారికి చేరవేశాడు. ఒక సినిమా థ్రిల్లర్‌ను తలపించే ఈ గూఢచర్య కేసులో ఢిల్లీ పోలీసులు కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీట్ ద్వారా దిగ్భ్రాంతికరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి.
న్యూడ్ ఫోటోల కోసం యుద్ధ రహస్యాలు!
సోషల్ మీడియా వేదికగా పరిచయమైన ఒక మహిళ, పాక్ నిఘా సంస్థకు ఏజెంట్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమె పంపిన అసభ్యకర ఫోటోలకు తరించిపోయిన సదరు వింగ్ కమాండర్, అందుకు ప్రతిఫలంగా రహస్య యుద్ధ ప్రణాళికకు సంబంధించిన ఒక పేజీని వాట్సాప్ ద్వారా పంపాడు. మరిన్ని ఫోటోలు పంపితే ఇంకా కీలక సమాచారం ఇస్తానంటూ బేరసారాలకు దిగినట్లు ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు.

ఇందులో అత్యంత కీలకమైన డ్రోన్ యూనిట్ నిర్మాణం, డ్రోన్ పరీక్షల ఫలితాలు, ఆయుధాల సామర్థ్యం, యుద్ధ సమయాల్లో వాటిని మోహరించే ప్రాంతాల వివరాలు ఉన్నాయి. వీటితో పాటు లేహ్‌లో ఫైటర్ జెట్ల కదలికలు, సూరత్‌గఢ్‌లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో జరిగిన సైనిక విన్యాసాల వివరాలను కూడా శత్రువులకు చేరవేసినట్లు తేలింది.
3,008 మెసేజ్‌లు.. తోటి ఉద్యోగుల ఫోన్లలో స్పైవేర్!
ఈ ఏడాది జనవరి 12 నుంచి ఏప్రిల్ 1 మధ్య వీరిద్దరి మధ్య భారీ స్థాయిలో సంభాషణలు జరిగాయి. వాట్సాప్ డేటా ప్రకారం మొత్తం 3,008 టెక్స్ట్ మెసేజ్‌లు, 65 ఫోటోలు, 42 వాయిస్ కాల్స్, నాలుగు వీడియో కాల్స్, ఆరు లింకులు మార్చుకున్నట్లు విచారణలో బయటపడింది. అంతటితో ఆగకుండా, పాక్ ఏజెంట్ పంపిన ప్రమాదకరమైన స్పైవేర్ (మాల్‌వేర్) యాప్‌లను సదరు అధికారి తన కింద పనిచేస్తున్న మరో ఐదుగురు సిబ్బంది ఎలక్ట్రానిక్ పరికరాల్లో కూడా ఇన్‌స్టాల్ చేశాడు. దీనివల్ల పైఅధికారుల మధ్య జరిగే రహస్య సంభాషణలన్నీ శత్రుదేశానికి చేరే ప్రమాదం ఏర్పడిందని పోలీసులు కోర్టుకు తెలిపారు.
స్మార్ట్‌ఫోన్ లో బయటపడిన గుట్టు
కార్యాలయంలోకి స్మార్ట్‌ఫోన్ తీసుకెళ్తుండగా అధికారులు ఆపి తనిఖీ చేయడంతో ఈ గూఢచర్య వ్యవహారం బట్టబయలైంది. ఎయిర్ ఫోర్స్ నిఘా విభాగం కొంతకాలం పాటు ఇతడి కదలికలపై కన్నేసి, ఆధారాలు సేకరించిన తర్వాత పోలీసులకు అప్పగించింది. మే 30న అధికారిక రహస్యాల చట్టం కింద అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు, జూలై 30న కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం నేరం రుజువైతే 14 ఏళ్ల వరకు కఠిన కారాగార శిక్ష పడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ కేసు న్యాయవిచారణలో ఉంది.














Click it and Unblock the Notifications
